మా ఏడాది పాలనలో ప్రజల ముఖంలో చిరునవ్వు.. ప్రశ్నించే హక్కు..: ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో లోకేశ్
విశాఖలో ఒక వ్యక్తి బతకడానికి రూ.700 కోట్లతో రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు.

Lokesh
ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో గెలిచింది టీడీపీ, జనసేన, బీజేపీ కాదని.. రాష్ట్ర ప్రజలు గెలిచారని మంత్రి లోకేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనుకభాగంలో ఏపీ సర్కారు సభ నిర్వహిస్తోంది. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహిస్తున్న ఈ సభలో లోకేశ్ మాట్లాడారు.
“గత ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిచాం. ప్రజలు చరిత్రను తిరగరాశారు. ఇది ప్రజా విజయం. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ్డ ఫలితాలు వస్తాయని అంబేద్కర్ అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో పెట్టుబడులు రాకుండా చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉండేది. రోడ్లు వేయలేదు.. రహదారులపై గుంతలు పూడ్చలేదు.
Also Read: వీటన్నింటి మధ్య ఏపీ అప్పుడు విలవిలలాడిపోయింది: ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో పవన్ కల్యాణ్
వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం ప్రకటనలు చేసుకుంది. విశాఖలో ఒక వ్యక్తి బతకడానికి రూ.700 కోట్లతో రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు. విశాఖ ఉక్కు, రైల్వే జోన్ గురించి వారు ఆలోచించలేదు. కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు ఓ డాక్టర్‌ను హింసించారు.
ప్రశ్నిస్తే లాఠీదెబ్బలు, అరెస్టులు. ఇటువంటి పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకే కూటమిని ఆశీర్వదించారు. ఐదేళ్లు విధ్వంసం చేసినవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజల ముఖంలో చిరునవ్వు కనపడుతోంది. ప్రజలకు ప్రశ్నించే హక్కును ఇచ్చింది” అని లోకేశ్ తెలిపారు.
“జూన్ 4 ప్రజలు విజయం సాధించి రాష్ట్రం చరిత్ర తిరగరాసిన రోజు. గత 5ఏళ్ల విధ్వంస పాలనకు విముక్తి కలిగిన రోజు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కి కృషి చేస్తున్నాం. కేంద్ర సాయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులు పెడుతోంది. 5 ఏళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే సాధించి చూపాం. ఉద్యోగులే ప్రభుత్వానికి గుండెకాయ.
ప్రజలకు చేరువగా వెళ్లి సేవలందించండి. దేవుడు కూడా అన్ని సమస్యలు తీర్చలేడు. అవకాశం ఉన్నంత వరకూ సమస్యలు పరిష్కరిస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టి పోయిన బకాయిలు చెల్లిస్తున్నాం” అని అన్నారు.