ఏజెన్సీ ప్రాంతాలపై కూటమి ఎందుకు ఫోకస్ పెట్టినట్లు? కూటమి దృష్టంతా దీని మీదే ఉందా?

గిరిజ‌నుల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు..ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు, ఆస్పత్రులు, నీటి సౌకర్యంతో పాటు..ఉపాధి కల్పనపై ఫోకస్ పెడుతోంది. ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏజెన్సీ ఏరియాలో రోడ్డు వేయించి వార్తల్లో నిలిచారు.

ఏజెన్సీ ప్రాంతాలపై కూటమి ఎందుకు ఫోకస్ పెట్టినట్లు? కూటమి దృష్టంతా దీని మీదే ఉందా?

Updated On : August 12, 2025 / 8:38 PM IST

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు. అందులో 164 సీట్లు కూటమి ఖాతాలోనే ఉన్నాయి. క్లీన్ స్వీప్‌కు 11 సీట్ల దూరంలో ఉన్నట్లు లెక్క. అయితే ఓట్ల పరంగా వైసీపీకి 40శాతం ఓటింగ్ వచ్చింది. అందులో ఆ పార్టీకి సాలిడ్‌ ఓటు బ్యాంకుగా ఉన్నది ఎస్పీ, ఎస్టీలు. ఇందులో గిరిజనుల ఓటు బ్యాంకు ఎంత కాదన్న 10 నుంచి 12 శాతం ఉంటుంది. ఈ ఓటర్లు వైసీపీ వెంటే ఉన్నారు.

మొన్నటి ఎన్నికల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. ఎస్టీ రిజర్వ్‌డ్‌ అరకు పార్లమెంట్‌ సీటు..అంత కూటమి వేవ్‌లోనూ వైసీపీ సొంతం చేసుకుంది. పైగా అరకు, పాడేరు వంటి ఎస్టీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ సీట్లలో వైసీపీ గెలిచింది. దీంతో వైసీపీ కోర్ ఓటు బ్యాంకును తమవైపును తిప్పుకునే స్కెచ్ వేస్తోంది కూటమి సర్కార్. తమకు 164 సీట్లున్నా..మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఉన్నా..వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న ఎస్టీ, ఎస్సీ ఓటర్లను ఆకట్టుకునే ప్లాన్ చేస్తోంది.

ఏపీలో గిరిజ‌న ఓటు బ్యాంకు 10-12 శాతం ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయినా..ఈ ఓటు బ్యాంకు మొత్తం ఆ పార్టీకే పడిందనేది కూటమి లెక్కలు. గిరిజ‌న ప్రాబ‌ల్యం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాకుండా..ఇతర జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ఎస్టీలు..కూడా గెలుపోటములను డిసైడ్ చేస్తున్నారు. దీంతో వీరి ఓటు బ్యాంకుపై..పార్టీలు, నాయ‌కులు కాస్త స్పెషల్ ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది. 2014 ముందు వరకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఈ ఓటు బ్యాంకు వైసీపీకి మళ్లింది.

Also Read: రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి అవకాశం లేనట్లేనా?

గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌మ ప‌ట్టును భారీగా పెంచుకుంది. 2014, 2019 ఎన్నిక‌ల్లో గిరిజ‌న నియోజక‌వ‌ర్గాల్లో వైసీపీ వన్‌సైడ్‌గా విజ‌యం సాధించడానికి ఇదే కార‌ణం. 2024లో కూట‌మి పార్టీల దూకుడుతో ఏజెన్సీ ఏరియాల్లో వైసీపీ హవా కొంత త‌గ్గింది. అయిన‌ప్పటికీ..వైసీపీకి అనుకూలంగానే గిరిజ‌న ప్రాంతాలు, నియోజక‌వ‌ర్గాల్లో రాజ‌కీయాలు సాగుతున్నాయి. దీనిని అడ్డుకునేందుకు కూట‌మి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మ‌న్యం స‌హా..పోల‌వ‌రం వంటి గిరిజ‌న నియోజ‌వ‌క‌ర్గాలు, ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది.

అక్కడి ప్రజల మనసులు దోచుకునే ప్రయత్నం
గిరిజ‌నుల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు..ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు, ఆస్పత్రులు, నీటి సౌకర్యంతో పాటు..ఉపాధి కల్పనపై ఫోకస్ పెడుతోంది. ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏజెన్సీ ఏరియాలో రోడ్డు వేయించి వార్తల్లో నిలిచారు. గిరిజనులకు చెప్పులు, మామిడికాయ‌లు, చీరలు పంచ‌డం వంటివి చేశారు. ఇలా గిరిజనుల సెంట్రిక్‌గా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది కూటమి. కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ కూడా ఏజెన్సీ ఏరియాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన టూర్లతో గిరిజనులతో మన్ననలు పొందుతుంటే.. చంద్రబాబు సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలపై కాన్సంట్రేట్ చేసినట్లు కనిపిస్తోంది.

ఈ మధ్యే మ‌న్యం జిల్లాలో ప‌ర్యటించిన చంద్రబాబు.. ఆదివాసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, గిరిపుత్రుల్లో మరింత చైతన్యం తీసుకురాగలిగితే అభివృద్ధికి ఢోకా ఉండదని చెప్పుకొచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు గతంలో తాము జీవో నెంబర్ 3 తీసుకొస్తే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ జీవోలు రద్దయ్యాయని, రద్దైన జీవో నెం.3 స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో గిరిజనులకు మేలు చేస్తామంటున్నారు.

అల్లూరి జిల్లా పాడేరు మండలం వంజంగిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న బాబు..కాఫీ తోటలను పరిశీలించి, గిరిజన సంప్రదాయ వేడుకలను తిలకించారు. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని చెప్పి అక్కడి ప్రజల మనసులు దోచుకునే ప్రయత్నం చేశారు. అయితే మన్యం పార్టీ నాయ‌కుల‌తో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పాడేరు వైసీపీ సిట్టింగ్ సీటు. ఇక్కడ వైసీపీ దూకుడుకు అడ్డుకునేందుకు ఏం చేస్తున్నారని లోకల్ లీడర్లను ప్రశ్నించారు.

అంతేకాదు..తన పర్యటన సందర్భంగా హడావుడి చేసిన ఎమ్మెల్యేను ఎందుకు ప్రశ్నించలేకపోయారంటూ..క్లాస్ తీసుకున్నారట. ఈ లెక్కన ఏజెన్సీ ఏరియాలపై పట్టు సాధించేందుకు కూటమి బిగ్ స్కెచ్‌తో ఉన్నట్లే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సాలిడ్‌ ఓటు బ్యాంకుగా ఉన్న గిరిజనులను సగమైనా తమవైపునకు తిప్పుకోవాలనేది కూటమి స్కెచ్. చంద్రబాబు, పవన్ వ్యూహాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి.