సీట్ల కోత.. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

టీడీపీ, బీజేపీతో పొత్తులో జనసేన సీట్ల కోతపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు.

సీట్ల కోత.. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

pawan kalyan comments on Janasena seats cut in alliance

pawan kalyan : టీడీపీ, బీజేపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ”నేను తీసుకున్న సీట్లు తక్కువా.. ఎక్కువా.. అనేది పక్కన పెట్టండి. జనసేన, టీడీపీ, బీజేపీలు 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాయని భావించాలి. జగన్ అధికారంలో ఉండకూడదు. ఒక్కడి దగ్గర ఇంత సంపద ఉండకూడదు. జగన్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికే కాదు.. దేశానికే ముప్పు. ఏపీలో జగన్ పోవాలి.. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ పోవాలి. వ్యూహం నాకొదిలేయండి. టైమింగ్ నాకొదిలేయండి. వాళ్లను వ్యూహం సినిమా తీసుకోమనండి.. మనం వ్యూహం వేద్దాం. ఏపీనే కాపాడుకునేవాడిని.. భీమవరాన్ని కాపాడుకోలేనా..?” అని జనసేనాని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సహా పలువురు నాయకులు మంగళవారం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ”గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే.. బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారు. యుద్దం చేయనీకుండా నాకు సంకెళ్లు వేశారు. భీమవరంలో కంటే పులివెందులలో పోటీ చేసి ఉంటే బాగుండేదని అనుకున్నా. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోయి ఉన్నా.. నేను బాధపడేవాడిని కాదు. సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు. కానీ గతంలో నా ఒక్క సీటు గెలిచి ఉంటే.. ఇవాళ పరిస్థితి వేరేగా ఉండేది. గతంలో జరిగిన తప్పిదాలకు నేను పరిహరం కడుతున్నాను.

ఇవాళ నవశకం ప్రారంభించాం. భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి.. పొత్తులను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి నేను ఓడిపోతే.. నాపై పోటీ చేసిన రామాంజనేయులు చాలా బాధపడ్డారు. భీమవరంలో పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి కూడా స్థలం ఇవ్వకుండా ఎమ్మెల్యే గ్రంధి అడ్డుకున్నారు. నేను పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికే గ్రంధి శ్రీనివాస్ అడ్డుకున్నారంటే.. ఎంత రౌడీయిజం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి.

Also Read: గీతాంజలి ఆత్మహత్య.. వారిని వదిలేది లేదని సీఎం జగన్ వార్నింగ్, రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా

గ్రంధి శ్రీనివాసును అక్కడి నుంచి తరిమేయాలి. గ్రంధి భీమవరంలో చాలా మందికి బంధువే. మన కులస్తుడని గ్రంధిని వదిలేయాలా..? ఓ వీధిరౌడీని ఎమ్మెల్యే చేయడం వల్ల భీమవరంలో నిమ్మకాయ షోడా అమ్ముకునే వ్యక్తిని కూడా బెదిరించే పరిస్థితి వచ్చింది. తన డ్రైవరును చంపి డోర్ డెలివరి చేసిన అనంతబాబు మన కులస్తుడేనని వదిలేస్తామా..?జైలుకెళ్లిన అనంతబాబు బెయిల్ మీద వస్తే.. బాస్ ఈజ్ బ్యాక్ అనడం కరెక్టేనా..? పార్టీ పెట్టడానికి సొంత అన్నను కూడా కాదని వచ్చాను. సొంత అన్నను ఇబ్బంది పెట్టే వచ్చాను.

నేను గెలిచి ఉంటే భీమవరంలో డంపింగ్ యార్డును తొలగించేవాడిని. నేను చాలా హ్యాండ్సమ్ పొలిటిషీయన్ను. పద్దతిగా మాట్లాడతాను.. కానీ ఎదుటి వాళ్లు యుద్దం కోరుకుంటే నేను దానికి రెడీ సిద్దం.. సిద్దం అంటూ జగన్ కోకిలలా కూస్తున్నాడు. జగనుతో యుద్దానికి సిద్దం. యుద్దం అంతిమ ఫలితం ప్రక్షాళనే. జగన్ జలగలను తీసేస్తాం.. భీమవరంలో ఉన్న జగన్ జలగ గ్రంధిని తీసేస్తాం. కాపు కులస్తుడని గ్రంధిని వెనకేసుకు వస్తే.. ఆ ప్రభావం కులం మీద పడుతుంది.. ఆలోచించాలి. గొడవలు పెంచే వారు నాకొద్దు.. తగ్గించేవారు కావాలి. అందుకే రామాంజనేయులను పార్టీలోకి ఆహ్వానించాను. వచ్చే ఎన్నికల్లో జనసేన భీమవరాన్ని కొట్టి తీరాలి. భీమవరంలో జనసేన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. భీమవరాన్ని నేను వదలను” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read: ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మళ్లీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు.. ఈసారి ఏమన్నారంటే?

పవనే భీమవరం అభ్యర్థి: పులపర్తి
భీమవరం స్థానం నుంచి తాను అభ్యర్థిని కాను.. పవనే అభ్యర్థి అని పులపర్తి రామాంజనేయులు అన్నారు. ప్రజల కోసం తపన పడే ఏకైక నాయకుడు పవన్ అని, ఆయన ఆశయాలకు ఆకర్షితుడనై జనసేనలో చేరినట్టు చెప్పారు. మంచి వాళ్లు రాజకీయాల్లోకి రావాలపొ సమాజం కోసం త్యాగాలు చేసిన నేత పవన్ అని ప్రశంసించారు. పవన్ వల్లే టీడీపీతో బీజేపీ జతకట్టిందని.. మూడు పార్టీల మధ్య పొత్తుకు కారణం ఆయనేనని వెల్లడించారు. ప్రాణం ఉన్నంత వరకు పవన్ కల్యాణ్ వెంట ఉంటానని చెప్పారు. 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు.