జనసేనానీ ‘దివిస్’ పర్యటన

జనసేనానీ ‘దివిస్’ పర్యటన

Updated On : January 9, 2021 / 7:56 AM IST

Pawan Kalyan ‘Divis’ tour : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో 2021, జనవరి 09వ తేదీ శనివారం పర్యటించనున్నారు. కొత్తపాకల గ్రామంలో దివీస్‌ రసాయయ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రామస్తులను ఆయన కలువనున్నారు. ఇందుకోసం ఆయన ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం బురుగుపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్‌ మార్గంలో అన్నవరం చేరుకుని.. అక్కడి నుంచి కార్యకర్తలతో ర్యాలీగా తొండంగి చేరుకుంటారు. దివీస్‌ కంపెనీ బాధితులను పరామర్శిస్తారు. దివీస్‌ పరిశ్రమ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు అనుమతి ఇచ్చే విషయంలో హైడ్రామా నడిచింది. దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ఆ ప్రాంతంలో పర్యటించాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. అయితే ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఆయన పర్యటనకు అనుమతి లేదని తొలుత జిల్లా ఎస్పీ ప్రకటించారు. పవన్‌ పర్యటనతో శాంతిభద్రతల సమస్య వస్తుందని..అందుకే అనుమతి నిరాకరిస్తున్నట్టు వెల్లడించారు.

దీంతో జనసేన నాయకులు అటు ప్రభుత్వంతోనూ.. ఇటు పోలీసులతోనూ మాట్లాడారు. ఎస్పీ కార్యాలయం దగ్గర జనసేన కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా… ఇవ్వకపోయినా పవన్‌ పర్యటన చేసి తీరుతారని తెలిపారు. దీంతో పోలీసులు పవన్‌ పర్యటనకు అనుమతిస్తున్నట్టు నాదెండ్ల మనోహర్‌కు ఫోన్‌లో తెలియజేశారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాలని, కోవిడ్‌ నిబంధనలు పాటించాలని కండిషన్‌ పెట్టారు. అంతేకాదు.. దివిస్‌ పరిశ్రమ చుట్టుపక్కలకు వెళ్లవద్దని, ఎలాంటి ఆస్తులకు నష్టం వాటిళ్లకుండా చూడాలని కోరారు. ఈ మేరకు జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అనుమతి వచ్చినట్టు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.