లోకల్ వార్‌లోనూ జనసేనానిది అదే తప్పు..!

గ్రామ స్థాయిలో కమిటీలు లేవు… మండల స్థాయిలో లీడర్లు లేరు… ఇక జిల్లా స్థాయిలో అయితే చెప్పనక్కల్లేదు.. గత ఎన్నికల్లో పార్టీ అధినేతతో సహా ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీ మరింత బలహీన పడింది. తాజాగా జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ లోకల్ వార్‌లో నెగ్గుకురాగలదా… మార్పు కోసం అంటూ దూసుకువచ్చిన జనసేన.. ఏపీలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఆయా పార్టీలకు చెందినత నేతలంతా జిల్లాలకే పరిమితమై లోకల్ వార్ హీటెక్కిస్తున్నారు. ఈ నేపధ్యంలో జనసేన కూడా లోకల్ వార్‌కు సిద్ధమని ప్రకటించింది.
అంతే కాకుండా ఢిల్లీకి వెళ్లి కమళనాధులతో పొత్తులు ఖరారు చేసుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విజయవాడలో భేటీ అయిన జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ స్థానిక ఎన్నికలపై చర్చించింది. ఈ ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు వెళ్తామని రెండు పార్టీల నేతలు ప్రకటించారు. సత్వరమే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడంతో పాటు ఈ నెల 12న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని సమన్వయ కమిటిలో నేతలు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లడంతో పాటు, భవిష్యత్తులో కేంద్ర సహకారంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అన్న అంశంపైనా ఇరు పార్టీల నేతలు చర్చించారు.
అయితే స్థానిక ఎన్నికలకు సిద్ధమని ప్రకటనలు చేస్తున్నా దానికి సంబంధించిన వ్యూహం, కార్యాచరణ ఇప్పటి వరకూ జనసేన నిర్ణయించలేదు. అంతే కాకుండా గత ఎన్నికల్లో చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారు పవన్. గత ఎన్నికల్లోనూ పార్టీ కమిటీలు వెయ్యకుండానే ఎన్నికలకు వెల్లి చతికిలపడ్డారు. అయితే మళ్లీ అలాంటి తప్పునే లోకల్ వార్ లోనూ చేస్తున్నారు జనసేనాని. అటు వైసీపీ, ఇటు టీడీపీ గ్రామ స్థాయి నుంచి బలంగా ఉన్న పరిస్థితుల్లో జనసేనకు కనీసం గ్రామ, మండల స్థాయి కమిటీలు కూడా లేకపోవడం ఇబ్బందే అనే భావన ఆ పార్టీ నేతలనుంచే వ్యక్తం అవుతోంది.
ఎన్నికలు అంటే గ్రామ స్థాయి కమిటీలే కీలకం.. అందులోనూ లోకల్ ఎన్నికలు అంటే వారి పాత్ర మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వ్యవస్థ జనసేనకు లేకపోవడం దానిపై పవన్ దృష్టి పెట్టకపోవడం మరోసారి గత ఫలితాలే వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇక జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి ఎలాంటి వ్యూహంతో లోకల్ వార్‌కు వెళతాయో.. ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.