రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోవాలి..పెద్దన్న పాత్ర పోషించాలి – పవన్

రాజధాని తరలింపు..రైతుల ఆందోళనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో ఆందోళనలు ఉధృతమౌతున్న దృష్ట్యా జనసేనానీ అలర్ట్ అయ్యారు.
2020, జనవరి 10వ తేదీ శుక్రవారం మంగళగిరికి చేరుకున్న ఆయన..గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లా నేతలతో భేటీ అవుతున్నారు. రాజధానిలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు పవన్.
కేంద్రాన్ని ఇందులో చేర్చడం గమనార్హం. విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజధాని విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే..భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం చర్చించాలని, అనంతరం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాజధాని రైతులకు మాత్రం అన్యాయం జరగకూడదని హెచ్చరించారు జనసేనానీ.
మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన, GN RAO కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత రాజధాని ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజధాని రైతులు భగ్గుమన్నారు. రోడ్లెక్కారు. నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. వీరికి మహిళలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఇతరులు జత కలిశారు.
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీగా ఏర్పాటైంది. వీరి ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ..ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా చేస్తున్నారు. జేఏసీకి టీడీపీ, వామపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. ప్రధానంగా టీడీపీ..ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. తాజాగా పవన్ చేసిన కామెంట్స్‌పై ఎలాంటి రియాక్ట్ వస్తుందో చూడాలి.
Read More : – కవాతు నిర్వహించాలా ? వద్దా ? : నేతలతో పవన్ కళ్యాణ్ భేటీలు