Pawan Kalyan: ఏ భాషనైనా బలవంతంగా రుద్దడం.. గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ సరికాదు.. కానీ..: పవన్ కల్యాణ్

జాతీయ ఐక్యతను ప్రోత్సహించడంతో పాటు దేశంలోని భాషా వైవిధ్యాన్ని రక్షించడానికి బహుభాషా విధానాన్ని రూపొందినట్లు వివరించారు.

Pawan Kalyan: ఏ భాషనైనా బలవంతంగా రుద్దడం.. గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ సరికాదు.. కానీ..: పవన్ కల్యాణ్

Pawan Kalyan

Updated On : March 15, 2025 / 7:11 PM IST

దేశ వ్యాప్తంగా త్రిభాషా సూత్రం అమలు విషయంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

తమిళనాడు నేతల తీరుపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ డీఎంకే తీరు సరికాదని అనడం, ఆయన కామెంట్లను డీఎంకే నేతలు పలు విధాలుగా వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

దీనిపై ఇవాళ ఎక్స్‌ వేదికగా పవన్ కల్యాణ్ మరోసారి స్పందించి వివరణ ఇచ్చారు. ఏ భాషనయినా బలవంతంగా రుద్దడం, గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ సరికాదని చెప్పారు. ఈ తీరు జాతీయ, సాంస్కృతిక సమగ్రత లక్ష్యాన్ని సాధించడంలో ఉపయోగపడదని తెలిపారు.

తాను ఎన్నడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. హిందీని తప్పనిసరి చేయడాన్ని తాను వ్యతిరేకించానని తెలిపారు. హిందీని భాషను అమలు చేయాలని జాతీయ విద్యా విధానం-2020లో కూడా నేరుగా లేకపోయినప్పటికీ దీనిపై తప్పుడు ప్రచారానన్ని వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని చెప్పారు.

Also Read: త్వరలోనే ఈ సమస్య రానుందా? దీని నుంచి తప్పించుకోవడానికి బంగారం కొనడమే మార్గమా? 

జాతీయ విద్యా విధానం-2020 కింద స్టూడెంట్స్‌ విదేశీ భాషతో పాటు మాతృభాష సహా ఏవైనా 2 భారతీయ భాషలు నేర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ హిందీ వద్దనుకునేవారు వారి మాతృ భాషతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధి, బోడో, కొంకిణి, మైథిలీ, మెయిటీ, నేపాలీ, ఉర్దూ ఇలా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంపిక చేసుకోవచ్చని అన్నారు.

జాతీయ ఐక్యతను ప్రోత్సహించడంతో పాటు దేశంలోని భాషా వైవిధ్యాన్ని రక్షించడానికి బహుభాషా విధానాన్ని రూపొందినట్లు వివరించారు. రాజకీయ అజెండాల కోసం త్రిభాషా సూత్రాన్ని తప్పుగా వ్యాప్తి చేయడం, దీనిపై తాను వైఖరిని మార్చుకున్నారని కొందరు అనడం వారి అవగాహనా రాహిత్యమే అవుతుందని అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి భాషా స్వేచ్ఛతో పాటు నచ్చిన విద్యను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉండాలన్న సూత్రానికి తమ పార్టీ కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు.