అందుకే నా చిన్న కూతురితో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించాను: పవన్ కల్యాణ్ కామెంట్స్
తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.

తాను తిరుమల తిరుపతి శ్రీవారి వద్దకు వెళ్లినప్పుడు తన చిన్న కూతురితో డిక్లరేషన్ ఇప్పించానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అలా నిజమైన సంప్రదాయాలు పాటించే వ్యక్తిని తానని, అందుకే డిక్లరేషన్ ఇప్పించానని తెలిపారు. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
అయోధ్య రామ జన్మభూమి లో శ్రీరాముని ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంటే దేశ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ “నాచ్ గాన” కార్యక్రమం అని అవమానిస్తారా? దీనిని ఏ హిందువూ ప్రశ్నించరా? అంటే వారు మన రాముడిపై జోకులు వేస్తే చూస్తూ కూర్చోవాలా? అని అన్నారు.
తాను పరాజయం చెందినా, పరాభవం పొందినా తాను ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నానంటే తన సనాతన ధర్మంపై ఉన్న నమ్మకం, తనను నడిపించేలా చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి, జంతువు కొవ్వుతో కలిపి తయారు చేసి అపచారం చేస్తే మేము మాట్లడకూడదా అని నిలదీశారు. జంతువు కొవ్వుతో తయారు చేసిన లడ్డూలు అయోధ్య రామాలయానికి పంపిస్తారా? అని అన్నారు.
శ్రీరాముడి విగ్రహంపై చెప్పులతో దాడిచేశారని, శ్రీరాముడి విగ్రహం తల నరికేశారని, రామాయణం కల్పవృక్షం అంటే కాదు విషవృక్షం అని అన్నారని, మరి తమకు కోపాలు రావా అని ప్రశ్నించారు. మెకాలే అనే ఒక వ్యక్తి మన దేశాన్ని దెబ్బ కొట్టాలంటే ముందు సంస్కృతిని దెబ్బ తీయాలని చెప్పి దెబ్బతీశాడని అన్నారు.
ఆ రోజు నుంచి మన సనాతన ధర్మంపై దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. మిడిల్ ఈస్ట్ దేశాలు వాటిని ఇస్లాం దేశాలుగా ప్రకటించుకుని ఇతర మతస్తులను తరిమేస్తుంటే ఏ ఒక్క సూడో సెక్యులరిజం వ్యక్తులు మాట్లాడరు, కానీ ఇక్కడ మాత్రం సెక్యులరిజం అని చెబుతారని అన్నారు.
Sanatana Dharma Raksha Board: వారాహి సభలో డిక్లరేషన్ ప్రకటించిన పవన్ కల్యాణ్