Sanatana Dharma Raksha: వారాహి సభలో డిక్లరేషన్ ప్రకటించిన పవన్ కల్యాణ్

దేశంలో అందరికీ అర్థం కావాలని ఇవాళ తాను ఇంగ్లిష్‌లోనూ మాట్లాడాల్సి వస్తుందని అన్నారు.

Sanatana Dharma Raksha: వారాహి సభలో డిక్లరేషన్ ప్రకటించిన పవన్ కల్యాణ్

Updated On : October 3, 2024 / 7:45 PM IST

దశాబ్దానికి పైగా తనను, తన కుటుంబాన్ని కొందరు అవమానించారని, నీచంగా మాట్లాడారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అయినప్పటికీ ఒక్క మాట మాట్లాడలేదని, అధికారం వచ్చినా సరే తాను ప్రతీకార రాజకీయాలు చేయాలనుకోలేదని చెప్పారు. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ మాట్లాడారు.

ఇదే డిక్లరేషన్

  • ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి
  • సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి
  • సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి
  • సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి
  • సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి
  • ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి
  • ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలు, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి

ఇంకా ఏమన్నారు?

ఇవాళ నిర్వహిస్తున్న వారాహి సభ చాలా ప్రత్యేకమైనదని, తమ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటిందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 100 రోజుల్లో ఎప్పుడూ రోడ్డు మీదకు రాలేదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచించామని తెలిపారు.

ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, దానిని ఎలా నిలబెట్టాలని ఆలోచించినట్లు చెప్పారు. అందరికీ అర్థం కావాలని ఇవాళ తాను ఇంగ్లిష్‌లోనూ మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. ఇస్లాం సమాజాన్ని చూసి కొందరు నేర్చుకోవాలని చెప్పారు. ఓ హిందువుగా, సగటు భారతీయుడిగా తాను ప్రజల ముందుకు వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు.

‘ఇవాళ నాకు అన్యాయం జరిగిందని నేను రాలేదు, ధర్మానికి అవమానం జరిగింది.. అన్ని ధర్మాలను గౌరవించే సనాతన ధర్మంపై దాడులు చేస్తుంటే వచ్చాను. తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చింది. గతంలో కూడా నేను తిరుపతి వారాహి సభలో చెప్పాను తప్పు జరుగుతుంది, సరిదిద్దుకోండి అని అయినా వైసీపీ వారు వినలేదు. ఇవాళ నేను ఉప ముఖ్యమంత్రి గానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీ ముందుకు రాలేదు, నేను సగటు హిందువుగా, సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా, భారతీయుడిగా మీ ముందుకు వచ్చాను. నేను హిందూ మతాన్ని అనుసరిస్తాను, నేను ఇస్లాం, క్రిస్టియానిటి, సిక్, ఇతర అన్ని మతాలను గౌరవిస్తాను’ అని చెప్పారు.

‘నేను నా ధర్మానికి అన్యాయం, అవమానం జరుగుతుంటే నన్ను మాట్లాడవద్దు, రాజకీయం చేయవద్దు అంటారు, నా తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రం అయితే నేను మాట్లాడకూడదా? ఇదేనా సూడో సెక్యులరిజం ముసుగులో మాట్లాడే మేధావులకు చెబుతున్నా, నేను నిజమైన సనాతనవాదిని, నేను సనాతన హిందువును, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, హిందూ మతాన్ని పాటిస్తాను’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా