ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లను తొలగించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్
AP Volunteers: దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లను తొలగించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని పిటిషనర్ చెప్పారు. నియామకాల్లో వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారని అన్నారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో వాలంటీర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కొత్త ప్రభుత్వం ఈ వ్యవస్థ కొనసాగిస్తుందా? కొనసాగించినా, ఇప్పుడున్న వారికే మళ్లీ అవకాశం ఇస్తుందా? లేదా? అన్నది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఎన్నికల ముందు రాజకీయ దుమారానికి దారితీసిన వాలంటీర్ల వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.
గత ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిరేపుతోంది. కొత్త ప్రభుత్వ విధానం ప్రకారం వాలంటీర్లు కొనసాగుతారా? లేరా? అన్నది ఒక ఎత్తైతే… ఎన్నికల ముందు వైసీపీ నేతల ఒత్తిడితో రాజీనామా చేసిన లక్షా 8 వేల మంది భవిష్యత్ ఆగమ్య గోచరంగా తయారైంది.
రాష్ట్రంలో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల 65 వేల మంది వాలంటీర్లను నియమించింది ప్రభుత్వం. వీరికి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం అందజేసింది. ఐతే వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించుకున్నారని, ప్రజాధనం దోచిపెడుతున్నారని తీవ్రంగా విమర్శించిన టీడీపీ… ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఈసీపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు.
ఇదే సమయంలో తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు రూ. 10 వేలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. అంతకుముందు తమ గౌరవవేతనం పెంచాలని ఎంత ఒత్తిడి తెచ్చినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదనే కోపంతో ఉన్న చాలా మంది వాలంటీర్లు… టీడీపీ పట్ల ఆకర్షితులయ్యారు.
ద్విచక్రవాహనాలు నడిపేవారందరూ హెల్మెట్ తప్పకుండా ధరించాల్సిందే: ఏపీ హైకోర్టు