పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన ఘటనపై క్లారిటీ ఇచ్చిన అడిషనల్ ఎస్పీ
మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగురవేశారని తెలిపారు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై నిన్న డ్రోన్ ఎగరడం కలకలం రేపిన విషయం తెలిసిందే. మంగళగిరిలోని నిర్మాణంలో ఉన్న పార్టీ ఆఫీసు భవనంపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఆఫీసుపై డ్రోన్ ఎగిరిన ఘటనపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవి కుమార్ క్లారిటీ ఇచ్చారు. డ్రోన్ ఏపీ ఫైబర్‌కు చెందినదిగా గుర్తించామని అన్నారు.
మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగురవేశారని తెలిపారు. గత మూడు రోజులుగా డ్రోన్ ఎగురవేస్తున్నారని చెప్పారు. ఫైబర్ నెట్ అధికారులతో చర్చించి నిర్ధారణకు వచ్చామని తెలిపారు.
కాగా, పవన్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగరడంతో నిన్న భద్రతా పరమైన కారణాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులకు ఆ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇటీవలే పవన్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే ఇప్పుడు పార్టీ కార్యాలయంపై డ్రోన్ ఎగరడంతో జనసేన నేతలు ఆందోళన చెందారు. పోలీసులు డ్రోన్‌ని ఎవరు ఆపరేట్ చేశారనే అంశంపై ఆరా తీసి నిజాన్ని తేల్చారు.