ys sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. ప్రభుత్వం దేనికి భయపడుతోందంటూ షర్మిల ఫైర్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

ys sharmila
ys sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హౌస్ అరెస్టు అయ్యారు. ఈరోజు ఉద్దండరాయునిపాలెంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. షర్మిల నివాసం వద్దకు భారీగా పోలీసులను మోహరించారు. బయటకు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. ఆమె పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.
పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా ఉద్దండరాయుని పాలెం వెళ్లి తీరుతానని షర్మిల స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో షర్మిల నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలాఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మే2న అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణం పనులను పున: ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మురంగా జరుగుతున్నాయి.
ప్రభుత్వం దేనికి భయపడుతుంది..? : షర్మిల
పోలీసులు గృహనిర్భందంపై షర్మిల ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు.. విజయవాడలోని నా విల్లాలో నన్ను ఎందుకు గృహనిర్భందంలో ఉంచారు..? ఏం కారణం చేత.. దయచేసి ఏపీ ప్రజలకు చెప్పడి. నా కార్యాలయానికి అంటే పార్టీ కార్యాలయానికి వెళ్లడం నేరమా..? మా రాజ్యాంగ హక్కులను ఎందుకు కాలరాయాలని మీరు ప్రయత్నిస్తున్నారు..? మీ ప్రభుత్వం దేనికి భయపడుతోంది..? అంటూ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Andhra Pradesh Chief Minister garu,
Why am I house arrested in my villa in Vijaywada? for what reason ? Pls tell the people of AP.
Just going to my work place- the PCC office @INC_Andhra is a crime now? Why are you trying to curtail our constitutional rights? What is your govt…— YS Sharmila (@realyssharmila) April 30, 2025
మరోవైపు షర్మిలపై ప్రధాని నరేంద్ర మోదీ అభిమాని పూల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోదీపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారతదేశం నిఘా వ్యవస్థలపైనా, దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని, భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.