Posani Krishna Murali: సారీలు.. గుడ్‌బైలు.. అయినా ఆగని అరెస్టులు.. పోసాని అరెస్ట్‌.. నెక్స్ట్‌ ఎవరి వంతు వస్తుందోనని..

అప్పట్లో అడ్డగోలుగా మాట్లాడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు టీడీపీ నేతలు.

Posani Krishna Murali: సారీలు.. గుడ్‌బైలు.. అయినా ఆగని అరెస్టులు.. పోసాని అరెస్ట్‌.. నెక్స్ట్‌ ఎవరి వంతు వస్తుందోనని..

Updated On : February 27, 2025 / 7:41 PM IST

ఏపీలో సోషల్ మీడియా వికృతకాండకు చెక్‌ పెట్టాలన్న పోలీసుల ప్రయత్నం కొత్త మలుపు తీసుకుంటోంది. ఇంకా చెప్పాలంటే పొలిటికల్‌ అరెస్ట్‌ల పర్వం కాస్త సినీ గ్లామరస్ వైపు టర్న్ తీసుకుంది. సినీ గ్లామర్‌తో వైసీపీ సానుభూతిపరులుగా..రెచ్చిపోయి అడ్డగోలుగా మాట్లాడినోళ్ల మీద ఫోకస్ పెట్టారు ఏపీ పోలీసులు.

ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా దెబ్బ మీద దెబ్బ అబ్బా అన్నట్లుగా మారిపోయింది సీన్. రెచ్చిపోయినోళ్లంతా సైలెంట్ అయిపోతూ వచ్చారు. సర్ధుకునేవాళ్లు సర్ధుకున్నారు. గతంలో చేసిన ఓవరాక్షన్‌పై కూటమి రియాక్షన్‌..వరుస అరెస్టులతో..అంతా గప్‌ చుప్‌ అయిపోయారు.

సినీ గ్లామర్‌తో వైసీపీ సింపథైజర్స్‌గా పోసాని కృష్ణమురళి, ఆర్జీవీ, శ్రీరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడారని టీడీపీ క్యాడర్ చాలా సీరియస్‌గా ఉంది. వీళ్లంతా చంద్రబాబు ఫ్యామిలీని హద్దులు దాటి ట్రోలింగ్‌ చేశారని..అడ్డగోలుగా బూతులు తిడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు.

పోసాని, శ్రీరెడ్డి, ఆర్జీవీ అరెస్ట్‌ అంటూ ప్రచారం
ఈ క్రమంలోనే నాలుగైదు నెలలుగా పోసాని, శ్రీరెడ్డి, ఆర్జీవీ అరెస్ట్‌ అంటూ ప్రచారం జరిగింది. ఇంతలోనే శ్రీరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తూ తనను వదిలేయాలని వేడుకుంది. ఇక పోసాని అయితే పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించారు. డైరెక్టర్ ఆర్జీవీ అయితే ఇక రాజకీయాల జోలికి వెళ్లనని చెప్పుకొచ్చారు.

వీళ్లంతా సారీలు..గుడ్‌బైలు చెప్పడం..అదే టైమ్‌లో అరెస్టులపై కూటమి సర్కార్ కాస్త హడావుడి తగ్గడంతో ఇక తమను వదిలేసినట్లే అని వాళ్లు రిలాక్స్‌ అయ్యారు. కట్‌ చేస్తే ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని పోసాని ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. అబ్బా సాయిరామ్‌ ఎంత పనైపోయిందనుకున్న పోసాని ఆరోగ్యం బాలేదని కాస్త హడావుడి చేశారు. ఫైనల్‌గా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన ఈ కేసులో పోసానిని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు.

చంద్రబాబు ఫ్యామిలీలోని ఆడవాళ్ల మీద తిట్ల పురాణంతో పాటు..క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడారని పలు..ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో పోసాని, శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో శ్రీరెడ్డికి ముందస్తు బెయిల్‌ వచ్చింది. పోసాని అయితే లేటెస్ట్‌గా నమోదైన కేసులో అరెస్ట్ కావాల్సి వచ్చింది. అయితే పవన్‌నుద్దేశించి పోసాని దారుణమైన పదజాలంతో పరుషంగా మాట్లాడారని వాదిస్తోంది జనసేన. వ్యక్తిగతంగా పవన్‌ను తిట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు జనసైనికులు. పవన్‌ ప్రెజర్‌ వల్లే పోసాని చుట్టూ ఉచ్చు బిగిసిందని..ఇక నెక్స్ట్ శ్రీరెడ్డి కార్నర్ అయిపోవడం పక్కా అన్న ప్రచారం జరుగుతోంది.

ఇక డైరెక్టర్ ఆర్జీవీ ఇప్పటికే పోలీస్ విచారణకు హాజరయ్యారు. కేసులు కూడా ఫేస్ చేస్తున్నారు. ఆయన కూడా పవన్‌పై వెటకారంగా మాట్లాడటం, ట్వీట్లు చేయడం వంటివి మర్చిపోలేమంటున్నారు జనసైనికులు. ఆర్జీవీని కూడా అరెస్ట్ చేయాల్సిందేనన్న డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోసాని అరెస్ట్ నేపథ్యంలో ఇక టీడీపీ క్యాడర్‌ డిమాండ్లలో భాగంగా మిలిగిలిపోయింది శ్రీరెడ్డి, ఆర్జీవీ ఇద్దరే. పొలిటికల్‌ లీడర్లలో వంశీ అరెస్ట్ అయిపోయింది. ఇక కొడాలినాని వంతు మాత్రమే మిగిలి ఉందంటున్నారు.

కక్ష పూరిత అరెస్ట్‌లా?
రెడ్‌బుక్‌ అమలులో భాగంగానే పోసానిని అరెస్ట్ చేశారని..ఈ కక్ష పూరిత అరెస్ట్‌లను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ అంటుంటే..చట్టప్రకారమే అరెస్టులు జరుగుతున్నాయని టీడీపీ అంటోంది. అధర్మంగా, దుర్గార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ ధర్మం శిక్షిస్తుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌తో పాటు వారి కుటుంబంలోని ఆడబిడ్డలను కూడా పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని మండిపడుతున్నారు. నోరుంది కదా అని నీచంగా వాగేవాళ్లకు ఏ గతి పడుతుందనేందుకు పోసాని కృష్ణమురళి అరెస్టే నిదర్శనమన్నారు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఇదంతా సరే కానీ…ఒక డైరెక్టర్‌ను మాత్రం ఇంకా బొక్కలో వేయకుండా వదిలిపెట్టడంపై ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారంటున్నారు సోమిరెడ్డి. ఆయన ఇండైరెక్టుగా ఆర్జీవీని టార్గెట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది.

అప్పట్లో అడ్డగోలుగా మాట్లాడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు టీడీపీ నేతలు. పోనీలే అని ప్రభుత్వ పెద్దలు వదిలేద్దామనుకున్నా..క్యాడర్‌, లీడర్ల మాత్రం అస్సలు ఊరుకోవట్లేదట. దీంతో సినీ గ్లామర్‌తో రెచ్చిపోయిన మరో ఇద్దరు వైసీపీ సింపథైజర్స్‌తో పాటు ఓ కీలక నేత అరెస్ట్‌ ఎపిసోడ్‌ కూడా ఉంటుందని అంటున్నారు. కాకపోతే కాస్త ముందు వెనుక..కానీ టైమ్‌ చూసి వరుసపెట్టి అందరినీ బొక్కలో వేయడం పక్కా అని చెప్పుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో అరెస్ట్‌ అయ్యే వైసీపీ సానుభూతిపరులు ఎవరో చూడాలి మరి.