Prathipati Pulla Rao: అందుకే జగన్ సీఎం సీట్లో కూర్చున్నారు: మాజీ మంత్రి ప్రత్తిపాటి

Prathipati Pulla Rao: జగన్ ఎలా సీఎం అయ్యారన్న విషయంపై ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ముందు జగన్ చేసిన పనులను వివరించారు.

Prathipati Pulla Rao: అందుకే జగన్ సీఎం సీట్లో కూర్చున్నారు: మాజీ మంత్రి ప్రత్తిపాటి

Prathipati Pulla Rao

Updated On : April 16, 2023 / 3:13 PM IST

Prathipati Pulla Rao: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు బయటపడుతున్నాయని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లాలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… పాదయాత్రలో జగన్ రెడ్డి ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చారని అంతేగాక, కోడి కత్తి.. వివేక హత్య కేసు.. ఇలా అనేక దుర్మార్గాలతో మోసాలతో సీఎం సీట్ లో కూర్చున్నారని చెప్పారు.

సానుభూతి పొందేందుకే కోడి కత్తి డ్రామా ఆడారని, కోడి కత్తి కేసులో ఎన్ఐఏ వాస్తవాలు బయటపెట్టడంతో ప్రజలు ఛీ కొడుతున్నారని ప్రత్తిపాటి చెప్పారు. కోడి కత్తితో సానుభూతి పొందలేకపోవడంతో పీకే ఇచ్చిన మరో ఐడియానే వివేక హత్య అని ఆరోపించారు. ఎవరిని చంపైనా.. ఏమి చేసైనా సానుభూతి పొంది ఎన్నికల్లో గెలవాలన్నదే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని చెప్పారు. సుప్రీంకోర్టు వివేక హత్య కేసుకు సంబంధించి ఏప్రిల్ 30 డెడ్ లైన్ విధించడంతో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం బయటకు వస్తుందని అన్నారు.

అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని, రేపోమాపో అవినాశ్ రెడ్డి కూడా అరెస్టు కావచ్చని ప్రత్తిపాటి చెప్పారు. ఇది తాడేపల్లి ప్యాలెస్ కు తాకుతుందని అన్నారు. అసలు కుట్రదారులను గుర్తించకుండా ఈ కేసు ముగింపు పలికే అవకాశం లేదని తెలిపారు. తప్పకుండా వివేక హత్య కేసు వెనక ఉన్న అసలు సూత్రధారులు రాబోయే రోజులలో బయటకు వస్తారని చెప్పారు.

మూడున్నర సంవత్సరాలుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా సహజ వనరులను కొల్లగొట్టి వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ఇసుక మట్టి మద్యం మైనింగ్ మాఫియాతో రాష్ట్రాన్ని కొల్లగొట్టారని చెప్పారు. వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు వేసుకునే స్థాయికి సీఎం జగన్ దిగజారారని అన్నారు. జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు అక్రమ కేసులతో సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు.

స్టిక్కర్లు వేసి జగనే మా నమ్మకం అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రత్తిపాటి నిలదీశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన జగన్ రెడ్డి స్టిక్కర్ల సీఎంగా మిగిలిపోతారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచి 175 స్థానాలతో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. దేశంలోని చాలా రాజకీయ పార్టీలు పీకే, ఐపాక్ లాంటి ఎన్నో ఏజెన్సీలను పెట్టుకొని వారి ఆలోచనలతో దుర్మార్గాలు చేస్తున్నారని తెలిపారు.

ఇలాంటి ఏజెన్సీలతో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ప్రత్తిపాటి అన్నారు. కులాల మధ్య అగాధం సృష్టిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారని తెలిపారు. సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయాలని ధర్నా చేసిన తెదేపా నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని అన్నారు. చిలకలూరిపేటలో ఉన్న మంత్రి దోపిడీని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Girl appeals to Modi : ‘మోడీ జీ.. నేను చెప్పేది వినండి’ అంటూ ప్రధాని మోడీకి ఓ బాలిక చేసిన విజ్ఞప్తి.. ఏంటంటే?