Ram Mohan Naidu: సీఎం జగన్ పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

సీఎం జగన్ వైఖరి తితిలీ తుపాను సమయంలో చూశామని, అలాంటి వ్యక్తి ఇప్పుడు రైతులు నష్టపోతే బైటకి వస్తారా అంటూ టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.

Ram Mohan Naidu: సీఎం జగన్ పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ram mohan naidu kinjarapu takes on cm jagan for farmers woes

Updated On : November 14, 2023 / 5:43 PM IST

Ram Mohan Naidu Kinjarapu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి ప్రచార ఆర్బాటాల మీద ఉన్న శ్రద్ద రైతులపై లేదని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 23న వస్తున్న సీఎం.. తమ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాకే అడుగుపెట్టాలన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా అన్నదాతల సమస్యలను అసలు పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడుపై కేసులు ఏవిధంగా పెట్టించాలో ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేయడం లేదని అన్నారు. నేటికి స్కిల్ కేసులో సీఐడీ ఆధారాలు చూపించలేకపోయిందన్నారు.

రైతులపై జగన్ సర్కారు వివక్ష
రైతుల పట్ల జగన్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని.. వర్షాల్లేక పంటలు ఎండిపోయి అన్నదాతలు కన్నీరు పెడుతుంటే పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు. వర్షపాతం తక్కువ ఉంటుందని ముందునుండి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వచ్చినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కరువు మండలాలు సైతం ప్రకటించలేదని వాపోయారు. రైతును దగా చేస్తున్నారు తప్ప.. ఆదుకోవడంలేదని ధ్వజమెత్తారు. ఇరిగేషన్, అగ్రికల్చరల్ మినిస్టర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇరిగేషన్ మినిస్టర్.. రైతులపాలిట ఇరిటేషన్ మినిస్టర్ గా మారారని ఎద్దేవా చేశారు. టీడీపీ, చంద్రబాబుని తిట్టడం తప్ప మంత్రులు ప్రజలకోసం ఆలోచించడం లేదన్నారు. తమ హయాంలో పంట నష్ట పోకుండా రైన్ గన్స్, స్ర్పింకర్లు అందించినట్టు చేశామని గుర్తు చేశారు.

జగన్ వైఖరి అప్పుడే చూశాం
రాష్ట్రంలో ముప్పై శాతం తక్కువ వర్షపాతం నమోదైనా 103 కరువు మండలాలు మాత్రమే ప్రకటించడం శోచనీయమన్నారు. సీఎం జగన్ వైఖరి తితిలీ తుపాను సమయంలో చూశామని, అలాంటి వ్యక్తి ఇప్పుడు రైతులు నష్టపోతే బైటకి వస్తారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ చేపట్టిన బస్సు యాత్రల్లో రైతుల కష్టాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. పార్టీ జెండా పట్టుకుని వెళ్తే జనం కొట్టే పరిస్థితి ఉండటంతో అధికారులను ముందు పెట్టుకుని వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని, అన్నదాతలకు ఇన్ పుట్ సబ్సిడీ అందించాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.

Also Read: హైదరాబాద్ లో ప్రధాని మోదీ ప్రసంగం నాకు నచ్చలేదు.. ఆయన మాటలకు బాధపడ్డా