కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ నాకే: కేఏ పాల్

హైదరాబాద్: ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. రాష్ట్రంలోని 175 స్ధానాల్లో పోటీ చేస్తామని, 100 సీట్లు కచ్చితంగా తామే గెలుస్తామని, 175 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏపీకి ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ప్రజాశాంతి పార్టీ విజయమేనని కేఏ పాల్ తెలిపారు.
టీడీపీ, వైసీపీ పార్టీలు చేస్తున్న అవినీతిని రోజుకొకటి చొప్పున బయటపెడతానని పాల్ అన్నారు. తాడేపల్లిలో జగన్ ఉండటానికి కట్టుకున్న ప్యాలెస్ లాంటి ఇల్లుకు డబ్బు ఎక్కడ్నించి వచ్చిందని పాల్ ప్రశ్నించారు. జగన్ దోచుకున్న లక్ష కోట్లు ఇస్తే ఏపి కష్టాలు తీరుతాయని కేఏ పాల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్ధాపితమవటం ఖాయమని పాల్ జోస్యం చెప్పారు