MLA Sai Prasad: అలా చేయి.. నా పదవికి రాజీనామా చేస్తా: లోకేశ్‌కు ఆదోని ఎమ్మెల్యే సవాల్
MLA Sai Prasad: "మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని గౌరవం ఇస్తున్నాం.. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిది" అని అదోనీ ఎమ్మెల్యే అన్నారు.

Adoni MLA Y. Sai Prasad
MLA Sai Prasad: కర్నూలు జిల్లా ఆదోనిలో యువగళం పాదయాత్రలో టీడీపీ నేత లోకేశ్ తనపై చేసిన విమర్శలకు ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తనపై చేసిన విమర్శలపై చర్చకు లోకేశ్ సిద్ధమా? అని అడిగారు. నారా లోకేశ్ తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. 352 సర్వేలో భూ కబ్జా చేశామని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
లేదంటే నారా లోకేశ్ తన పాదయాత్రను విరమించి హైదరాబాద్ వెళ్లాలని ప్రసాద్ రెడ్డి అన్నారు. “మంగళగిరి అని పలకడానికి రాని పప్పు నాయుడు నాపై విమర్శలు చేయడం దారుణం. నారా లోకేశ్ చేసిన విమర్శలు సరికాదు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదవడం కాదు.. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.
మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని గౌరవం ఇస్తుంటే ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిది. ఏదో పాదయాత్ర చేయాలంటే చేస్తున్నావ్ తప్ప జగన్ పాదయాత్రకు వచ్చిన కరిజ్మా మీకు రాదు. నువ్వు పాదయాత్రని ఇక్కడితో ఆపి హైదరాబాద్ కి వెళ్లి నీ కొడుకుతో ఆడుకుంటావా? అని అన్నారు. నీవు చేసిన ఆరోపణలు ఒక్కటైన నిరూపించే దమ్ము నీకుందా?
రాజకీయంలో ఆడవాళ్లను లాగడం బాధాకర విషయమని మేము కూడా మీ ఇంట్లో వాళ్లను అంటే మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు. ఒకరిపై విమర్శలు చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పటికైనా బహిరంగ చర్చకు నీవొచ్చిన సరే లేదా మమ్మల్ని రమ్మంటే మేము నీ దగ్గరికి వస్తాము నా సవాల్ స్వీకరించాలి. అవినీతిలోకి నన్ను, నా కుటుంబాన్ని, ఆడవాళ్లను లాగితే ఇకనుంచి ఊరుకునే ప్రసక్తే లేదు” అని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.