Sajjala Ramakrishna Reddy: కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం- కూటమి నేతలకు సజ్జల వార్నింగ్
నియంత పోకడలో కొనసాగుతున్నారు. ఈరోజు నాయకులతో మొదలైంది రేపు ప్రజలపైనా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Sajjala Ramakrishna Reddy
- జోగి రమేష్ ఇంటిపై పథకం ప్రకారమే దాడి
- ఆయన కుటుంబసభ్యుల ప్రాణాలు తీయాలని చూశారు
- మీ గొయ్యి మీరు తవ్వుకోండి.. మాకు అభ్యంతరం లేదు
Sajjala Ramakrishna Reddy: రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే ఒళ్లు మండిపోతోందని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోలీసుల భద్రత మధ్య అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. టీడీపీ ఆర్గనైజ్డ్ ముఠా గుంటూరులో ఏం చేసిందో అందరూ చూశారని వ్యాఖ్యానించారు. పోలీస్ ఉన్నతాధికారులు కనీసం ఫోన్ కు కూడా దొరకలేదని మండిపడ్డారు.
హోంమంత్రితో సహా ఎస్పీని కలిసేందుకు వెళితే మాజీ మహిళా మంత్రినే రోడ్డు మీద నిలబెట్టారని ధ్వజమెత్తారు. బాధితుడైన రాంబాబును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారని వాపోయారు. రాంబాబు ఇంటికి దగ్గరలోనే టీడీపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉందన్న సజ్జల.. మేం అనుకుంటే ఏదైనా చేయగలమని ఒక మెసేజ్ ఇవ్వాలనే ప్రయత్నం చేశారని చెప్పారు.
అంబులెన్స్ లో కర్రలు, రాళ్లు, పెట్రోల్ బాంబులు..
”అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే అడ్డుకున్నారు. దాడి జరిగినపుడు రక్షణ కల్పించలేని పోలీసులు పరామర్శకు వెళ్లిన మాకు ఆటంకం కలిగించారు. జోగి రమేష్ ఇంటిపై పథకం ప్రకారం దాడి చేశారు. దాడిలో టీడీపీ నేతలతో పాటు రౌడీషీటర్లు పాల్గొన్నారు. అంబులెన్స్ లో కర్రలు, రాళ్లు, పెట్రోల్ బాంబులు తెచ్చారు. దాడికి పాల్పడిన వారితో పాటే పోలీసులున్నారు. దాడి జరిగినంతసేపు అక్కడే ఉండి తర్వాత వారిని అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు. దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి, భార్య, కుమారుడు ఇంట్లోనే ఉన్నారు. వారి ప్రాణాలు తీయాలనే ఈ దాడి చేసినట్లు కనిపిస్తోంది.
నియంత పోకడలో కొనసాగుతున్నారు. ఈరోజు నాయకులతో మొదలైంది రేపు ప్రజలపైనా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బందిపోటు దొంగల మాదిరి పోలీసుల సమక్షంలో మా నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. జోగి రమేష్ ఇంటిపై దాడి సంగతి తెలుసుకుందామని మా పార్టీ నాయకులు ప్రయత్నించారు. కానీ వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేశారు. జోగి రమేష్ ఇంటికి ఇప్పటివరకూ పోలీసులు ఎలాంటి విచారణకు రాలేదు. రివర్స్ లో జోగి రమేష్ పై అక్రమంగా కేసులు పెట్టారు.
చంద్రబాబు గారు అని పిలిచినా బూతులాగే వినిపిస్తోంది..
చంద్రబాబు గారు అని పిలిచినా వారికి బూతులాగే వినిపిస్తున్నట్లుంది. చట్టం, పోలీసులు మా చేతిలో ఉన్నారన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా దాడులు చేసుకుంటూ పోతే వారి గొయ్యి వారే తవ్వుకున్నట్లవుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలను జాతీయ స్థాయిలో చర్చకు తెస్తాం. తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేసిన ప్రచారాలు అబద్ధమని ప్రజలకు తెలియజేశాం. జగన్ తో పాటు మా పార్టీ నేతల ఫోటోలతో బ్యానర్లు వేశారు. ఎవరు వేశారో తెలియకుండా పేర్లు లేకుండా బ్యానర్లు వేశారు. టీడీపీ బ్యానర్లను తొలగించాలనే మేము కోరితే దాడులు చేశారు.
మీరు ఎన్ని దాడులు చేసినా మేం ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ గొయ్యి మీరు తవ్వుకోండి మాకు అభ్యంతరం లేదు. మీ గొయ్యి తవ్వుకునే క్రమంలో మమ్నల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే అన్నీ రికార్డ్ చేసుకుంటాం. కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Also Read: నాకు ఏం జరిగినా ఆయనే కారణం.. అందరినీ గుర్తిస్తాం, ఎవరినీ వదలం- జోగి రమేశ్
