టీడీపీ-జనసేన నుంచి వైసీపీలోకి వస్తామంటున్నారు- సజ్జల కీలక వ్యాఖ్యలు

24 సీట్లే ఇచ్చి.. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఘోరంగా అవమానించారు. టీడీపీ, జనసేనలో అసంతృప్తితో ఉన్న వాళ్లు వైసీపీలోకి వస్తామంటున్నారు.

టీడీపీ-జనసేన నుంచి వైసీపీలోకి వస్తామంటున్నారు- సజ్జల కీలక వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy : టీడీపీ-జనసేన కూటమిపై విమర్శలు గుప్పించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ-జనసేన అతుకుల బొంత అని విమర్శించారాయన. టీడీపీ-జనసేన అసంతృప్తులు.. వైసీపీలోకి వస్తామని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. నేతల ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతే పార్టీలోకి తీసుకుంటామన్నారు. అవకాశం ఉన్న చోట వారిని చేర్చుకునే అంశంను పరిశీలిస్తామన్నారు. అంతేకానీ.. గంపగుత్తగా వచ్చినంత మాత్రాన ఎవరిని పడితే వారిని చేర్చుకోలేమన్నారు. ఎన్నికలకు ఇప్పటికే గట్టి టీమ్ ను సిద్ధం చేసుకున్నామన్నారు సజ్జల.

”24 సీట్లే ఇచ్చి.. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఘోరంగా అవమానించారు. టీడీపీ, జనసేనలో అసంతృప్తితో ఉన్న వాళ్లు వైసీపీలోకి వస్తామంటున్నారు. మా నాయకుడి విధానం ఒక్కటే. వచ్చిన వాళ్ల వల్ల పార్టీకి ఉపయోగం ఉండి, వాళ్ల రికార్డ్ కూడా బాగుంటే.. తీసుకుంటాం. గంపగుత్తగా వస్తున్నారని వాళ్లందరిని తెచ్చుకుంటే ఎన్నికల ముందు పార్టీకి తలనొప్పులు ఉంటాయి. కాబట్టి, వారి పట్ల మాకు అంతగా ఆసక్తి లేదు” అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

మరోవైపు మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగే రేపటి వైసీపీ కీలక సమావేశం ఏర్పాట్లను సజ్జల పరిశీలించారు. ఎన్నికలకు ముందు జరిగే ఆఖరు కీలక సమావేశం ఇది అని ఆయన చెప్పారు. ఈ కీలక సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొంటారని సజ్జల వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎలా పని చేయాలి అని నేతలకు జగన్ దిశానిర్దేశం చేస్తారని సజ్జల పేర్కొన్నారు. గడపగడప కార్యక్రమంతో వైసీపీ ఎప్పుడో ప్రజల్లో ఉందని, ఎన్నికలకు గట్టి టీమ్ ను సిద్ధం చేసుకున్నామని సజ్జల వ్యాఖ్యానించారు.

రేపు వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ కీలక సమావేశం ఏర్పాటు చేస్తోంది. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ లో సీఎం జగన్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నేతలు హాజరు కానున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ అబ్జర్వర్లు ఈ కీలక భేటీకి హాజరుకానున్నారు.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..