పందెం కోళ్లు : కుక్కుట శాస్త్రాన్ని ఫాలో అవుతున్న పందెం రాయుళ్లు

పండక్కి ముందే పందెంకోళ్లు బరిలోకి దిగుతున్నాయి. కత్తి కట్టుకుని కాలు దువ్వుతున్నాయి. గోదావరి జిల్లాల్లో పందాలు జోరందుకోవడంతో… లక్షల రూపాయలు చేతులు మారనున్నాయి. పందెం రాయుళ్లు సరిహద్దులు, గ్రామ శివార్లలో శిబిరాలు ఏర్పాటు చేసి చెలరేగిపోతున్నారు. కోళ్ల పందాలంటే లక్షలతో పని. అందుకే పందాలు నిర్వహించేవారు, వాటిలో పాల్గొనేవారు కుక్కుట శాస్త్రాన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతుంటారు. ఏ పుంజుకు ఏ రోజు కలిసొస్తుందన్న లెక్కలు వేసుకుని మరీ బరిలో దించుతుంటారు. ఇందుకోసం కుక్కుట శాస్త్రంపై పట్టున్న సిద్ధాంతుల్ని కలిసి ప్లాన్ చేసుకుంటారు.
పోలీసులకు పట్టుబడకుండా అత్యంత పకడ్బందీగా పందాలను నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు దాడులు చేస్తుండటంతో… ఏ రోజుకారోజు పందెం బరుల్ని మరో ప్లేస్‌కు మార్చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి ముందుగానే కోడి పందాలు మొదలవుతాయి. వీటిపై నిషేధం ఉన్నప్పటికీ ఏటా జరుగుతూనే ఉన్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సరదాగా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు చెప్తున్నప్పటికీ… చాలాచోట్ల వేలు, లక్షల్లో పందాలు కాస్తున్నారు. కోడి పందాలు జరిగే చోట పందెం రాయుళ్లతో పాటు పైపందాలు కాసేవారు ఎక్కువగా ఉంటారు. దీంతో పందెం మొత్తం రోజురోజుకీ పెరుగుతోంది.
కోడి మెనూ ఇదే :-
* ఉదయం : ఇడ్లీ, ఉడకబెట్టిన కోడిగుడ్డు, బాదంపప్పు
* మధ్యాహ్నం : సజ్జలు, రాగులు, ఇతర ఆహార పదార్థాలు
* సాయంత్రం : రాగులు, సజ్జలు, ఉలవలు మినుములు, గోధుమలు..ఇలా 12 రకాల చిరుధాన్యాలతో చేసిన రొట్టె.
* మేకపోతు, ఖైమా, మేకపోతు కాళ్ల సూపు..రోజు మార్చి రోజు ఇస్తుంటారు.
* ఎండకు తట్టుకోవడానికి, శక్తి కోసం గ్లూకోజ్ నీళ్లు తాగిపిస్తారు.
* తొట్టెళ్లలో నీళ్లు పోసి కోళ్లను ఈత కొట్టిస్తారు. తిన్న ఆహారం జీర్ణం అవడం కోసం ఇలా చేస్తారు.
* తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బరువు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.