MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు..
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

MP Mithun Reddy
MP Mithun Reddy: మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ స్పీడ్ పెంచింది. కీలక సూత్రధారులు, పాత్రదారులుగా భావిస్తున్న వారిని వరుసగా విచారించేందుకు సిద్ధమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కమీషన్లు సమర్పించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులను కూడా సిట్ విచారణకు పిలుస్తోంది. వీరిని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో కలిపి ప్రశ్నించి కీలక వివరాలను రాబట్టాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మద్యం కుంభకోణం దర్యాప్తు నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఆయన విచారణకు హాజరవుతారా.. లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించినప్పటికీ.. విచారణకు సహకరించాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ మద్యం కేసులో దర్యాప్తులో భాగంగా ఇవాళ (గురువారం) విజయసాయిరెడ్డి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు.
మద్యం స్కాం లో రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని సూచించారు. రాజ్ ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉన్నాయి. ఇప్పటికే మూడు సార్లు రాజ్ కసిరెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు. ఒకవైపు ఆయనకోసం విస్తృతంగా గాలిస్తూనే తాజాగా ఈనెల 19న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు.
ఇప్పటికే మూడుసార్లు సిట్ విచారణకు డుమ్మా కొట్టిన రాజ్ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లు, భార్య పేరుతో పెట్టుబడులు పెట్టిన ఆసుపత్రిలో రెండు రోజులపాటు హైదరాబాద్ లో సిట్ సిబ్బంది సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాజ్ కసిరెడ్డి తండ్రికి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.