Andhra Pradesh : ఏపీలోకి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. అలర్ట్ జారీ..
Andhra Pradesh : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో శుక్రవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Southwest monsoon is expected to arrive in Andhra Pradesh in two to three days
- కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
- మరో రెండుమూడు రోజుల్లో ఏపీలోకి ఎంట్రీ
- 15 నాటికి రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం
Andhra Pradesh : నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకాయి. దీంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఏపీలోకి రుతుపవనాలు ఎప్పుడొస్తాయో క్లారిటీ వచ్చింది. రానున్న రెండుమూడు రోజుల్లో రాయలసీమ జిల్లాలను రుతుపవనాలు తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఆ తరువాత ఈనెల 10వ తేదీ నాటికి రాష్ట్రంలోకి పూర్తిగా రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈనెల 15వ తేదీ నాటికి రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రుతుపవనాల రాకతో ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
మరోవైపు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు.. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఉంటుందని.. మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని కొన్నిచోట్ల 42-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లో ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే కేరళం అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని.. రుతుపవనాలు దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలను తాకాయని కూడా ఒక ప్రకటన చేసింది.
తొలుత జూన్ 1వ తేదీ నుంచి రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ, మూడు రోజులు ఆలస్యంగా గురువారం (జూన్ 4న) రుతుపవనాలు కేరళను తాకాయి. రుతుపవనాలు విస్తరించడానికి అనుకూలంగా ఉండటంతో మరో రెండు, మూడు రోజుల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలు, అరేబియా, బంగాళాఖాతానికి విస్తరిస్తాయని అధికారులు అంచనా వేశారు.
