ఏపీలో మేరీ మాత విగ్రహం ధ్వంసం

Andhra Pradesh Temples : ఏపీ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో మండపేటలో మేరీమాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. చర్చీ ప్రాంగణంలో ఉన్న ఈ విగ్రహం ధ్వంసం కావడాన్ని స్థానికులు 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం ఉదయం చూశారు.
గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని పగులకొట్టారు. ఈ విషయం తెలుకున్న ఆ వర్గానికి చెందిన వారు ఆందోళన చేపట్టారు. ఎలాంటి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు చేపట్టారు.
అంతర్వేదిలో రథం దగ్ధం, ఇంద్రకీలాద్రిలో వెండి సింహాలు మాయంపై దుమారం రేగుతున్న సమయంలోనే.. ఆలయాల్లో వరుస విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
అంతర్వేదిలో 62 సంవత్సరాల చరిత్ర కలిగిన రథం దగ్ధం కావడం..నుంచి ప్రారంభమైంది. ఏదో ఒక ప్రాంతంలో విగ్రహాలను ధ్వసం చేయడం, విలువైన వాటిని దొంగిలించడం వంటివి చేస్తున్నారు. ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికారపక్షంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
నిడమానూరు సాయిబాబు విగ్రహం ధ్వంసం, వత్సవాయి మండలం మొక్కపేటలో పురాతనమైన కావీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న నంది చెవులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం, శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనలు కలకలం రేపాయి. ప్రభుత్వం ఘటనలపై సీరియస్ గానే ఉంది.
ఆలయాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్వేది రథం దగ్ధంపై సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కొందరు ఆకతాయిలు ఉద్దేశ్యపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.