Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. రేపు విచారణ
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్‌పై సుప్రింకోర్టులో బుధవారం విచారణ జరగనుంది.

Chandrababu Arrest
Supreme Court : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) క్వాష్ పిటీషన్‌పై సుప్రింకోర్టు (Supreme Court) లో రేపు (బుధవారం) విచారణ జరగనుంది. మంగళవారం రాజ్యాంగ ధర్మాసనం విచారణ ఉన్నందున సాధారణ కేసుల విచారణ ఉండదని అంతకుముందు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పేర్కొంది. దీనితోడు, ఈనెల 28 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగేందుకు మరో వారంరోజులు పడుతుందని తొలుత వార్తలు వచ్చాయి. తాజాగా చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ విచారణపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. అయితే, ఈ కేసును ఏ బెంచ్ విచారిస్తుందో సాయంత్రం వరకు వెల్లడి కానుంది.
Read Also : Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రోడ్డెక్కిన తారకరత్న భార్యాపిల్లలు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై ఏపీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో గత శనివారం పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను చంద్రబాబు తరపు లాయర్లు సోమవారం మెన్షన్ లిస్ట్ చేశారు. సోమవారం మెన్షన్ లిస్టులో చంద్రబాబు కేసు ప్రస్తావన లేకపోవటంతో మంగళవారం ప్రస్తావించాలని సీజేఐ చంద్రబాబు తరపు లాయర్లకు సూచించారు. కానీ, మంగళవారం చంద్రబాబు పిటీషన్ పై విచారణ జరుగుతుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. సీజేఐ నేతృత్వంలో క్యూరేటివ్ పిటిషన్ పై మంగళవారం స్పెషల్ బెంచ్ సమావేశం జరగనుంది. దీంతో ఇతర కేసుల ప్రస్తావనను సీజేఐ డీవై చంద్రచూడ్ అనుమతించలేదు. దీనికితోడు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణ మరోవారం పాటు జరగదన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే, సీజేఐ సూచనలతో సోమవారం మధ్యాహ్నమే చంద్రబాబు పిటీషన్‌కు సంబంధించిన మెన్షన్ మెమోను చంద్రబాబు తరపు లాయర్లు సీజేఐకి సమర్పించినట్లు తెలిసింది. అందులో భాగంగానే మెన్షన్ మెమోపై సీజేఐ రేపు విచారించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రేపటి కేసుల జాబితాలో లిస్ట్ చేయాలని రిజిస్ట్రార్‌కు సూచించినట్లు తెలిసింది. అయితే, రిజిస్ట్రార్ రేపు (బుధవారం) ఏ కోర్టు ముందు ఈ కేసును లిస్టు చేస్తారు? ఎన్నో నెంబర్ ఐటంగా ఈ కేసు ఉంటుందనేది సాయంత్రంకు సుప్రింకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. అయితే, బుధవారం నాడు సుప్రీంకోర్టు క్వాష్ పిటీషన్‌పై ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.