చంద్రగిరిలో రీ పోలింగ్ ఎలా పెడతారు : ఈసీకి టీడీపీ కంప్లయింట్

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదుచోట్ల రీపోలింగ్ కు ఆదేశించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. విచారణ జరపకుండా..వైసీపీ ఫిర్యాదుతో రీపోలింగ్ కు ఆదేశించడంపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఈమేరకు టీడీపీ నేతలు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ సీఈసీని కలిసి, మెమోరాండం సమర్పించారు. వైసీపీ ఫిర్యాదుతో.. ఎలాంటి విచారణ లేకుండా రీపోలింగ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. వైసీపీ ఫిర్యాదును ఏకపక్షంగా పరిగణనలోకి తీసుకుని ఏ విధంగా ఐదు చోట్ల రీపోలింగ్ కు నిర్వహిస్తారని, విచారణ జరపకుండా ఎందుకు రీపోలింగ్ కు వెళ్తున్నారని అభ్యంతరం తెలుపుతూ నేతలు సీఈసీకి మెమోరాండాన్ని సమర్పించారు.
వైసీపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని మొదటి నుంచి టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో ఇంటెలిజెన్స్ అధికారులను తొలగించినప్పుడు, ఎస్పీలను బదిలీ చేసినప్పుడు, ఏప్రిల్ 11న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి అంతకముందు టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదుచోట్ల రీపోలింగ్ నిర్వహించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నేతలు.
చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇటీవల కలిసి… తన నియోజకవర్గంలో ఒక వర్గానికి సంబంధించిన వారి ఓట్లు వేయనీయకుండా చేశారని ఫిర్యాదు చేశారు. దీంతోపాటు మరికొన్ని ఫిర్యాదులు రావడంతో… అక్కడి పరిస్థితులపై నివేదిక తెప్పించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఈసీఐకి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన ఈసీఐ… చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు అనుమతిచ్చింది.
చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామపురంలో… రీపోలింగ్‌కు అనుమతులు జారీ చేసింది. మే 19, 2019న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆయా బూత్‌ల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.