విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ఫోకస్.. బొత్సను ఓడించేందుకు వ్యూహాలు
ఈ సమావేశానికి ఏజన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజరయ్యారు.
Visakha Mlc Bypoll : విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ఫోకస్ పెట్టింది. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది. పల్లా శ్రీనివాస్ ఇంట్లో టీడీపీ సీనియర్లు సమావేశం అయ్యారు. అయ్యన్నపాత్రుడు, సీఎం రమేశ్ తో పాటు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఈ సమావేశానికి ఏజన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజరయ్యారు. వారిని అమరావతిలోని క్యాంపునకు తరలించనుంది టీడీపీ. 25రోజుల పాటు క్యాంపును కొనసాగించనుంది.
ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైంది. ఆర్ధికంగాను గోవింద్ సరైన అభ్యర్థి కావడంతో ఆయనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ జనసేనకు కేటాయించడంతో గోవింద్ కు అవకాశం దక్కలేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను ఎలాగైనా ఓడించాలనేది టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది.
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు ప్రారంభించారు. అనకాపల్లిలో సీఎం రమేశ్ ఇంట్లో గ్రామీణ ప్రాంత నేతలంతా సమావేశం అయ్యారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. మాడుగుల నుంచి టీడీపీ ఇంచార్జి విజయ్ కమార్ తనకు అవకాశం ఇవ్వాలని కోరినా.. గండి బాబ్జీ, పీలా గోవింద్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అనకాపల్లి స్థానంలో జనసేన నేత కొణతాల రామకృష్ణ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తన సీటును త్యాగం చేశారు పీలా గోవింద్. అలాగే జనసేన నుంచి వంశీ కృష్ణ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో గండి బాబ్జీ సైతం తన సీటును త్యాగం చేశారు. వీరిద్దరి వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, విశాఖ, అనకాపల్లి, అరకు పార్లమెంట్ కు సంబంధించిన నేతలు సైతం ఈ భేటీకి హాజరయ్యారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను పార్టీలోకి ఆహ్వానించి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏ విధంగానైనా దక్కించుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది.
Also Read : ఆ ఒక్కడి కోసం స్పెషల్ ఆపరేషన్, నీడలా వెంటాడుతున్న పోలీసులు.. అసలు వల్లభనేని వంశీ ఎక్కడ?