తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఈసీ నన్ను తిరస్కరించింది : హరిప్రసాద్‌

  • Published By: veegamteam ,Published On : April 14, 2019 / 11:37 AM IST
తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఈసీ నన్ను తిరస్కరించింది : హరిప్రసాద్‌

Updated On : April 14, 2019 / 11:37 AM IST

కేంద్ర ఎన్నికల సంఘం, టీడీపీ మధ్య వార్‌ ముదురుతోంది. ఈవీఎం టెక్నికల్ టెస్ట్‌కు టీడీపీ నుంచి టెక్నికల్  టీం నుంచి హరి ప్రసాద్‌ను పంపడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ కాకుండా ఇతర టెక్నికల్ టీమ్‌తో చర్చించేందుకు సిద్ధమని ఎన్నికల‌ కమిషన్ తెలిపింది. అయితే ఈవీఎంలో తప్పులు ఉండటం వల్లే ఈసీ భయపడుతోందంటూ టీడీపీ అరోపిస్తుంది. మరోవైపు ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనంటూ టీడీపీ టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ హరిప్రసాద్‌ ఆరోపిస్తున్నారు. 2010లో కేసుకు సంబంధించి చార్జ్‌షీటే దాఖలు కాలేదని…అలాంటప్పుడు తనపై కేసు ఉందంటూ చెప్పడం…ఈసీ తన తప్పును కప్పిపుచ్చుకోవడమేనని అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఈసీ తనను తిరస్కరించిందన్నారు.

వీవీ ప్యాట్‌ మొదటి టెస్ట్‌కు కూడా తనను పిలిచారని తెలిపారు. వీవీ ప్యాట్‌లో ఓటర్‌ స్లిప్‌ 7 సెకన్లు చూపించాలి కానీ 3 సెకన్లు మాత్రమే చూపించడంతో అనుమానం వచ్చిందన్నారు. అనుమానం నివృత్తి చేసుకోవడానికే ఈసీని కలవడానికి వచ్చానని తెలిపారు. ఈసీ సమాధానం చెప్పకుండా కేసు ఉందనడంతో మరింత అనుమానం పెరిగిందన్నారు. 10వ తేదీనే వీవీ ప్యాట్‌లో తాము తప్పును కనిపెట్టామని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని హరిప్రసాద్‌ చెప్పుకొచ్చారు.