స్టీల్ సిటీలో వైసీపీ రిపేర్ల వ్యూహం..! అక్కడ సత్తా చాటలేకపోతున్నారా?

మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

స్టీల్ సిటీలో వైసీపీ రిపేర్ల వ్యూహం..! అక్కడ సత్తా చాటలేకపోతున్నారా?

Updated On : May 20, 2025 / 10:04 PM IST

రాష్ట్రంలో ఎక్కడ విజయం సాధించినా…అక్కడ మాత్రం ఆ పార్టీకి ఎదురుగాలి తప్పడంలేదా? ఏ ఎన్నికల జరిగినా..ఎన్ని రాజకీయ వ్యూహాలను పదునుపెట్టినా అక్కడ సత్తా చాటలేకపోతున్నారా? రాజకీయాల్లో తల పండిన నేతలున్నా సరే..అక్కడ మాత్రం పార్టీకి ఎదురీత తప్పడంలేదా? పార్టీకి ఎన్ని రిపేర్లు చేసినా, ఎందరు ఇంచార్జీలను మార్చినా సేమ్ సీన్ రిపీట్ అవుతోందా?

ఉత్తరాంధ్ర అంతటా ప్రభంజనం వీచినా, వైసీపీ విజయం కోసం పరితపిస్తున్న ఆ ప్రాంతం మరేదో కాదు..స్టీల్ సిటీ విశాఖనే. 2019 ఎన్నికల్లో రాష్ట్ర మంతటా ప్రభంజనం సృష్టించినా విశాఖ సిటీలో మాత్రం వైసీపీ అంతగా ప్రభావం చూపలేకపోయింది. విశాఖ నాలుగు దిక్కులూ సైకిల్ పార్టీకే జై కొట్టాయి. విశాఖ అర్బన్ లో వైసీపీ అంతగా ప్రభావం చూపించలేకపోయింది. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో కూడా వైసీపీ బొటా బొటీ మెజారిటీనే సాధించింది. 30కి పైగా కార్పొరేషన్ వార్డులను టీడీపీ గెలుచుకుంది.

ఇక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోగా..టీడీపీ రాష్ట్రస్థాయిలో 90శాతం మెజార్టీలను సాధించి రికార్డు సృష్టించింది. విశాఖను రాజధాని చేస్తామని ఎన్నికల బరిలోకి దిగినా సరే జనం మాత్రం కూటమివైపే మొగ్గుచూపారు. ఇక్కడ విజయం కోసం వైసీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా సరే అందని పార్టీకి అందని ద్రాక్ష మాదిరే అవుతోందే తప్ప సక్సెస్ కాలేకపోతోంది.

Also Read: ఇంత హడావుడిగా కేసీఆర్‌, హరీశ్, ఈటలకు నోటీసులు ఎందుకు? వ్యూహం ఇదేనా?

విశాఖలో వైసీపీని గాడిలో పెట్టేందుకు పార్టీ అధిష్టానం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ గా తొలుత విజయసాయి రెడ్డిని…ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించినా సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఇప్పుడు లేటెస్ట్ గా రీజనల్ కో ఆర్డినేటర్ గా కాకినాడ జిల్లాకు చెందిన కురసాల కన్నబాబుకు బాధ్యతలు అప్పగించారు.

సామాజిక కోణంలో ఆయన నియామకం?
ఉత్తరాంధ్రాతో పాటు విశాఖలో ఓసీ కాపులు ఎక్కువగా ఉన్నారన్న కారణంతో సామాజిక కోణంలో ఆయన నియామకం జరిగిందన్న చర్చ నడుస్తోంది. అయితే కురసాలకు తోడుగా బీసీ నేత ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ కదిరి బాబూరావుని కూడా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకులుగా ఇటీవలే వైసీపీ అధిష్టానం నియమించింది.

ఇలా పార్టీ కో ఆర్డినేటర్ లు, పరిశీలకులు, ఇన్ చార్జిలు సంగతి పక్కన పెడితే విశాఖ వైసీపీలో నాయకులకు కొదలేలేదు. అయితే వీరి మధ్య కో ఆర్డినేషన్ అంతగా లేదన్నట్లుగా జిల్లా రాజకీయాల్లో వార్తలు విన్పిస్తున్నాయి. విశాఖలో పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత కాకినాడకు చెందిన కురసాల కన్నబాబు ప్రకాశం జిల్లాకు చెందిన బాబూరావు వీరిద్దరిపై ఉంది.

వీరిద్దరూ తొలుత జిల్లాలో ఉన్న సీనియర్లు, జూనియర్లే కాకుండా స్థానిక నాయకులు, స్థానికేతర నాయకులు ఇలా అందరినీ కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందన్న వాదన విన్పిస్తోంది. సామాజికవర్గాలవారీగా ఈక్వేషన్లను సరిచూసుకుంటూ ముందుకు సాగాలి. వీటిన్నింటి కంటే ముందుగా పార్టీ క్యాడర్ లో ఉన్న నిస్తేజాన్ని పోగొట్టి వారిలో ఉత్సాహాన్ని నింపేలా కార్యక్రమాలు చేపట్టాల్సిందేనని కొందరు కుండబద్దలు కొడుతున్నారు.

వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖలో వైసీపీని బలోపేతం చేయకపోతే మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇందుకు అనేక రిపేర్లు చేయాల్సి ఉందంటున్నారు. మరి ఆ రిపేర్లకు పార్లమెంట్ పరిశీలకలుగా వచ్చిన బాబూరావు హ్యాండ్ ఎంతవరకూ కలసి వస్తుందో..ఆయన లక్కీ హ్యాండ్ అవుతారా లేదా అన్నది తొందర్లో చూడాల్సి ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది.