ఇంత హడావుడిగా కేసీఆర్‌, హరీశ్, ఈటలకు నోటీసులు ఎందుకు? వ్యూహం ఇదేనా?

విచారణకు రావాలని కమిషన్ అయితే ముగ్గురు నేతలకు నోటీసులైతే జారీచేసింది.

ఇంత హడావుడిగా కేసీఆర్‌, హరీశ్, ఈటలకు నోటీసులు ఎందుకు? వ్యూహం ఇదేనా?

CM Revanth Reddy

Updated On : May 20, 2025 / 10:04 PM IST

తెలంగాణ పాలిటిక్స్ లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ప్రతిప‌క్షంపై అధికార ప‌క్షం దూకుడును మరింతగా పెంచుతోంది. ప్రతిప‌క్ష పార్టీల‌కు చెందిన ముగ్గురు కీల‌క‌ నేత‌ల‌కు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైంది. ఆ ముగ్గురు నేత‌లే టార్గెట్ గా కీల‌క అడుగు ప‌డింద‌నే చ‌ర్చ న‌డుర‌స్తోంది. ఇంత‌కీ ఎవ‌రా ముగ్గురు నేత‌లు..? వారి టార్గెట్‌గా ప‌డిన అడుగులు ఏంటి..? ఆ ముగ్గురి విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది?

తెలంగాణ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. ప్రతిప‌క్ష పార్టీల‌కు చెందిన ముగ్గురు నేత‌ల టార్గెట్‌గా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆ ముగ్గురు విష‌యంలో కీల‌క అస్త్రం ల‌భించ‌డంతో..ప్రయోగించేందుకు రంగం సిద్ధమైందన్న టాక్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హ‌రీష్‌రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద‌ర్ టార్గెట్‌గా ఉచ్చు బిగించేందుకు రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందట.

అందులో భాగంగానే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు హ‌రీష్‌రావు, ఈటెల రాజేంద‌ర్‌ల‌ను విచార‌ణ‌కు పిల‌వాల‌ని సర్కార్ నిర్ణయించిందట. అందుకే ఆఘమేఘాల మీద జ‌స్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ విచారణకు హాజరుకావాలంటూ ఈ ముగ్గురికి విడి విడిగా నోటీసులు జారీ చేసిందట. ఇంత హడావుడిగా నోటీసులు ఎందుకు జారీచేసింది..? దాని వెనుక అసలేం జరగిందన్న దానిపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

iQOO Neo 10R Vs OnePlus 13R: మీకు ఈ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? వీటిని ఎందుకు కొనాలంటే?

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవ‌క‌త‌వ‌క‌ల‌పై తెలంగాణ ప్రభుత్వం గ‌తేడాది మార్చిలో జ‌స్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో క‌మిష‌న్‌ను నియ‌మించింది. 3 నెల‌ల్లో విచార‌ణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాల‌ని కమిషన్ కు ప్రభుత్వం గడువు విధించింది. కానీ నేటికీ విచార‌ణ పూర్తికాక‌పోవ‌డంతో ఇప్పటివరకు ఐదుసార్లు గ‌డువు పెంచింది. విచార‌ణ‌లో భాగంగా క‌మిష‌న్ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయ‌డంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో భాగ‌స్వామ్యమైన అధికారులంద‌రిని పిలిచి బ‌హిరంగ విచార‌ణ చేసింది.

అలాగే ప్రజల నుంచి కూడా స‌మాచారం సేక‌రించింది. చివరకు ఐఏఎస్‌ల‌ను సైతం బ‌హిరంగ విచార‌ణ చేసింది. ప్రాజెక్టు విష‌యంలో నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటీ..ఎన్‌డీఎస్ఏ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విచార‌ణ జరిపిన విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ సైతం నివేదిక‌లు ఇచ్చాయి. వీట‌న్నింటి ఆధారంగా జ‌స్టిస్ చంద్రఘోష్ నివేదిక‌ను సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖ‌రుతో క‌మిష‌న్ గ‌డువు ముగియ‌నుండ‌టంతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్దమైంది. కానీ ఇంత‌లో ఆల్ ఆఫ్ స‌డెన్‌గా ప్రభుత్వం మ‌రో రెండు నెల‌ల గ‌డువు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ ఆలోచనలో భాగంగానే గ‌డువు పెంచారా?
క‌మిష‌న్ గ‌డువు మ‌రోసారి పెంచ‌డంతో ర‌క‌ర‌కాల ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. పొలిటిక‌ల్ లీడ‌ర్లను విచారించాలన్న ఆలోచనలో భాగంగానే గ‌డువు పెంచార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. క‌మిష‌న్ విచార‌ణ‌లో భాగంగా ఐఏఎస్‌లు..పూర్తిగా గ‌త ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేర‌కే పనిచేశామ‌ని వివరణ ఇచ్చారు. దీంతో అప్పట్లోనే పొలిటిక‌ల్ లీడ‌ర్లను కూడా విచార‌ణ‌కు పిల‌వాల‌ని క‌మిష‌న్ భావించింది. కానీ లీగ‌ల్ స‌మ‌స్యలను ద్రుష్టిలో పెట్టుకొని క‌మిష‌న్ ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకుంది.

ఎన్‌డీఎస్ఏ, విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ నివేదిక‌ల‌తో పాటు ఇంజ‌నీర్లు, ఐఏఎస్‌లు ఇచ్చిన వివ‌ర‌ణ‌ల ఆధారంగా రిపోర్ట్ ఇవ్వాల‌ని భావించింది. కానీ తాజాగా తన ఆలోచనను మార్చుకున్న కమిషన్..పొలిటిక‌ల్ లీడ‌ర్లను సైతం విచార‌ణ‌కు పిల‌వాల‌ని డిసైడ్ అయిందట. అందుకే ప్రాజెక్టు నిర్మాణంలో భాగ‌ స్వామ్యమైన ఈ ముగ్గురిని విచార‌ణ చేయ‌క‌పోతే..అసంపూర్తిగా ఉంటుంద‌నే ఆలోచ‌న‌తో ఓ నిర్ణయానికి వచ్చిన కమిషన్ తాజాగా కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్లకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీశ్ రావు, జూన్ 9న ఈటల విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది కమిషన్.

మొత్తంమీద ప్రతిప‌క్షానికి చెందిన ముగ్గురు కీల‌క నేత‌లు కేసీఆర్‌, హ‌రీష్‌రావు, ఈటెల రాజేంద‌ర్‌ల‌ను విచార‌ణ చేసేందుకు కాళేశ్వరం క‌మిష‌న్ సిద్ధం కావ‌డంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినట్లు అయింది. విచారణకు రావాలని కమిషన్ అయితే ముగ్గురు నేతలకు నోటీసులైతే జారీచేసింది. కానీ ఆ ముగ్గురు నేతలు అసలు కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ముగ్గురు నేతలు గనుక కమిషన్ ముందు విచారణకు హాజరైతే..తెలంగాణ పాలిటిక్స్ మరోసారి హాట్ హాట్‌గా మార‌నున్నాయి. మునుముందు ఈ వ్యవహారం ఎటువైపుకు దారితీస్తుందనేది చూడాల్సి ఉంది.