AP Telangana Water Issues: నీటి వివాదాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చ.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌పై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం..
కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్ లో కొనసాగాలని ఇరు రాష్ట్రాలు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి.

AP Telangana Water Issues: తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా జలాల పంపకాలపై కొన్నేళ్లుగా కొనసాగుతున్న వివాదం తాజాగా కీలక మలుపు తిరిగింది. నీటి హక్కుల విషయంలో వివాదాలు, పంపకాల్లో పంచాయతీలు, పరస్పర ఆరోపణలు వస్తున్న వేళ కేంద్ర జలశక్తి శాఖ తెలుగు రాష్ట్రాల సీఎంలతో నేరుగా సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలపై డిస్కస్ చేశారు.
గోదావరి, కృష్ణా నదుల జలాల పంపకాలు, అనుసంధాన ప్రాజెక్టులు, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నిర్వహణ వంటి కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు వినిపించాయి. టెలిమెట్రీ ఆధారిత డేటా పద్ధతులు, పారదర్శక నీటి వినియోగం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. నదుల నుంచి ఎక్కడి నుంచి ఎంత నీటిని తీసుకుంటున్నారు అన్న విషయంపై స్పష్టత ఉండేలా వ్యవస్థలను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చాయి రెండు రాష్ట్రాలు.
గోదావరి, కృష్ణా అనుసంధానం కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది.
సోమవారం ఆ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం వెలువడనుంది. కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్ లో కొనసాగాలని ఇరు రాష్ట్రాలు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ప్రాజెక్టులు, నీటి వాటాలపై స్నేహపూర్వక వాతావరణంలో చర్చ జరిగిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మూడు విషయాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.
Also Read: హిందీ నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ ఇంగ్లీష్ అంతకన్నా ముఖ్యం- జగన్ కీలక వ్యాఖ్యలు
రిజర్వాయర్ల నుంచి ఔట్ ఫ్లో దగ్గర టెలిమెట్రిక్ ల ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అనుమతించాయని తెలిపారు. శ్రీశైలం రక్షణ, మరమ్మతుల విషయంలో ఇరు రాష్ట్రాలు అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. ”పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అంశం.. కృష్ణా, గోదావరికి సంబంధించి తెలంగాణ రైజ్ చేసిన ఇష్యూస్.. వీటిలో టెక్నికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కనుక, ఈ టెక్నికల్ ఇష్యూస్ కి ముందుగా ఒక పరిష్కారం చూపే విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీలో టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో ఉంటారు” అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.