విశాఖ విష వాయువు ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

విశాఖలో విష వాయువు లీక్ తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారు. రెండు వేలకుపైగా అస్వస్థతకు గురయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో చికత్స పొందుతున్నారు. విష వాయువు లీక్ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ప్రమాద ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్యాస్ లీక్ ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అంతకముందు ప్రధాని మోడీ ఘటనపై స్పందించారు. ఏపీ సీఎం జగన్ తో ఫోన్ లో మాట్లాడారు. గ్యాస్ లీక్ ఘటన గురించి ఆరా తీశారు. ప్రమాద వివరాలను సీఎం జగన్ ప్రధానికి వివరించారు. ఘటనా స్థలంలో చేపట్టిన సహాయక చర్యలను సీఎం జగన్.. ప్రధానికి వివరించారు. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా సీఎం జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రమాద కారణాలు, సహా సహాయక చర్యలను గవర్నర్ కు వివరించారు.
విషవాయువు లీక్ అవ్వడంతో విశాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎల్.జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి స్టైరిన్ మోనోమర్ వాయువు లీక్ అయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. కళ్లు కనపడక బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. 2 వేల మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బిల్డింగ్ పై నుంచి పలువురికి గాయాలు అయ్యాయి. రోడ్డుపై ఎక్కడికక్కడ ప్రజలు కుప్పకూలిపోయారు. అర్థరాత్రి 2 గంటల 45 నిమిషాలకు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు.
ఊపిరాడక, కళ్లు కనపడక నరక యాతన పడుతున్నారు. రసాయనాల వాసనకు మహిళలు రోడ్డుపైనే పడిపోయారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు తవ్ర అస్వస్థతకు గురయ్యారు. విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. కెమికల్ గ్యాస్ వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర కెమికల్ గ్యాస్ వ్యాపించింది. గ్యాస్ ప్రభావానికి చెట్లు మాడిపోయాయి. గ్యాస్ వాసనకు మూగ జీవాలు విలవిలలాడాయి. కోళ్లు, కుక్కలు, పక్షులు, ఆవులు, గేదెలు మృత్యువాత పడ్డాయి. గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాయి.
Also Read | విశాఖలో విషవాయువు.. స్టైరిన్ గ్యాస్ దేనికి వాడతారు, ప్రమాదం ఎలా జరిగింది