Chandrababu Delhi Tour : ఢిల్లీకి చంద్ర‌బాబు నాయుడు.. పొత్తుల‌పై రానున్న క్లారిటీ!

చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్ల‌నుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

Chandrababu Delhi Tour : ఢిల్లీకి చంద్ర‌బాబు నాయుడు.. పొత్తుల‌పై రానున్న క్లారిటీ!

Chandrababu Delhi Tour

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని, అదే స‌మ‌యంలో కేంద్రంలోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని రాజ‌కీయ పార్టీలు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు దూసుకుపోతున్నారు. మ‌రో వైపు వైసీపీని గ‌ద్దె దింపి టీడీపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని తెలుగు దేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కంక‌ణం క‌ట్టుకున్నారు.

ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఈక్ర‌మంలో నేడు చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్ల‌నుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ రోజు మ‌ధ్యాహ్నాం రెండు గంట‌ల‌కు చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. రాత్రికి అక్క‌డే బ‌స చేయ‌నున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అగ్రనేత‌ల‌తో భేటీ కానున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. పొత్తుల వ్య‌వ‌హారం పై ఢిల్లీ వేదిక‌గా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

AP Budget 2024 : బ‌డ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. వెల్లడించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

ఏపీ అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన, బీజేపీల పొత్తుల‌ వ్య‌వ‌హారంపై ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు బీజేపీతో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. రాత్రికి ఢిల్లీలో బీజేపీ అగ్ర‌నాయ‌కులు జేపీ న‌డ్డా, అమిత్ షాల‌ను క‌ల‌వ‌నున్నారు.

పది అసెంబ్లీ, 7 లోక్ సభ స్థానాలను బీజేపీ ఆశిస్తోంది. గతంలో గెలిచిన విశాఖ నార్త్, రాజమండ్రి అర్బన్, తాడేపల్లి గూడెం, కైకలూరు అసెంబ్లీ స్థానాల సహ మరో ఆరు స్థానాలను బీజేపీ కోరుతోంది. అలాగే అరకు, విశాఖ, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలను ఇవ్వాల‌ని అంటోంది. బీజేపీ – జనసేన పార్టీల రెండింటికీ కలిపి 30 అసెంబ్లీ, 5 లేదా 6 ఎంపీ స్థానాలిచ్చే అవకాశం ఉందని ప్రచారం జ‌రుగుతోంది. చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌రువాత పొత్తుల‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాగా.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న త‌రువాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఢిల్లీకి వెళ్లే అవ‌కాశం ఉంది.