Bhimavaram: వైసీపీలో భీమవరం ఇన్‌ఛార్జి పోస్టు టెన్షన్‌.. ఇన్‌చార్జ్‌ రేసులో ముగ్గురి పేర్లు

బీసీ సామాజికవర్గం నుంచి ముగ్గురి పేర్లు ఇన్‌చార్జ్‌ రేసులో వినిపిస్తున్నాయి.

Bhimavaram: వైసీపీలో భీమవరం ఇన్‌ఛార్జి పోస్టు టెన్షన్‌.. ఇన్‌చార్జ్‌ రేసులో ముగ్గురి పేర్లు

Updated On : December 21, 2024 / 11:17 AM IST

Bhimavaram YCP Incharge: వలసలు వైసీపీకి కొత్త తంటాలను తీసుకువస్తున్నాయ్‌.. బలమైన నేతలు పార్టీని వీడుతుంటే ఆ నియోజకవర్గాల బాధ్యతలు ఎవరికి అప్పగించాలని హైకమాండ్ తర్జనభర్జన పడుతోందట. ఇప్పుడు భీమవరం విషయంలోనూ అధిష్టానం అదే ఆలోచనలో పడిందని లోకల్ టాక్..

వలసలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏ నేత ఎప్పుడు బైబై చెబుతారో అర్ధంకాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఖాళీ అయిన నియోజకవర్గాన్ని ఎవరికి కట్టబెట్టాలనేది హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారిందట. మాజీ ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ రాజీనామాతో భీమవరం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌ పోస్ట్ ఖాళీగా ఉంది.

గతంలో భీమవరం సెంటర్‌లో పవన్‌కల్యాణ్‌ను ఓడించిన ఘనత గ్రంధి శ్రీనివాస్‌ది.. ఇప్పుడు అదే రేంజ్ సారథి కోసం హైకమాండ్‌ జల్లెడ పడుతుందని లోకల్ పాలిటిక్స్‌లో టాక్ వినిపిస్తుంది. పార్టీని ఐదేళ్లపాటు నడిపించే సత్తా.. ఆర్థికబలం ఉన్న నేత కోసం గాలిస్తున్నారట.

కొయ్యే మోషెన్ రాజు నివాసంలో సుదీర్ఘ చర్చలు
భీమవరం ఇన్‌చార్జ్‌ పోస్ట్‌ ఎవరికి కట్టబెట్టాలని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషెన్ రాజు నివాసంలో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని లోకల్‌గా మరో గాసిప్ రీసౌండ్ చేస్తోంది. జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు కూడా ఎవరైతే బాగుటుందని అన్ని పేర్లను పరిశీలిస్తున్నారట.

భీమవరంలో కాపు సామాజికవర్గం ప్రభావం అధికంగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. అందుకే అదే సామాజిక వర్గంలో పార్టీని నడిపించే స్కిల్స్ ఉన్న నేత కోసం వెతుకుతున్నారని లోకల్ టాక్. ఈ రేసులో కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నమిల్లి వెంకట రాయుడి పేరు బిగ్‌ సౌండ్ చేస్తోంది. పార్టీకి ఆర్థిక అండదండలు కూడా ఉంటాయని లెక్కలు వేస్తున్నారట.

ఇన్‌చార్జ్‌ రేసులో ముగ్గురి పేర్లు
మరోవైపు బీసీ సామాజికవర్గం నుంచి ముగ్గురి పేర్లు ఇన్‌చార్జ్‌ రేసులో వినిపిస్తున్నాయి. శెట్టిబలిజ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ డీసీఎంస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి పేర్లను కూడా పరిశీలిస్తున్నారని లోకల్ క్యాడర్‌లో టాక్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీ సీటు కూడా ఈయన ఆశించారు. బీసీలకు భీమవరం బాధ్యతలు ఇస్తే వెంకటస్వామి బెటర్ ఆప్షన్ అని వైసీపీ జిల్లా పెద్దలు భావిస్తున్ననట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇదే గౌడ సంఘానికి చెందిన గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు పేరు కూడా భీమవరం వైసీపీ రేస్‌లో సౌండ్ చేస్తోంది. వీరిద్దరితోపాటు ఇటీవల ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసిన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమా బాల పేరు కూడా తెరమీదకు వచ్చిందట. న్యాయవాదిగా పనిచేస్తూ ప్రజల్లో మంచి పేరుతెచ్చుకున్న ఉమాబాలకు బాధ్యతలు అప్పగించినా బాగుంటుదనే అభిప్రాయానికి వచ్చారట.

భీమవరం వైసీపీ పగ్గాల కోసం బీసీ సామాజికవర్గం నుంచి ముగ్గురు నేతలు పావులు కదుపుతున్నట్లు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మరి అధిష్టానం భీమవరాన్ని ఎవరికి అప్పగిస్తుందో చూడాలి.

కూటమిలో పంపకాల లొల్లి తప్పదా? పదవి దక్కేదెవరికి?