ఈసారి చలి భిన్నంగా ఉంటుంది – వాతావరణ శాఖ

  • Published By: madhu ,Published On : December 14, 2020 / 08:03 AM IST
ఈసారి చలి భిన్నంగా ఉంటుంది – వాతావరణ శాఖ

Updated On : December 14, 2020 / 8:15 AM IST

cold is different Telugu States : క్రమేణా చలి పెరుగుతోంది. రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణంగా వేడి ఎక్కువగా ఉండే విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో సైతం చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ, కొండప్రాంతాల్లోని ప్రజలను చలిపులి వణికిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంలో మంచు దుప్పటి పరుచుకుంటోంది. దీంతో అరకు పర్యాటకులతో కళకళలాడుతోంది. ఇక్కడ చలిమంటలు వేస్తూ, చల్లటి వాతావరణంలో వేడిని ఆస్వాదిస్తూ పర్యాటకులు సందడి చేస్తున్నారు.

ఇక రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉదయం 10 వరకూ పొగమంచు తెరలు వీడటంలేదు. దీంతో రహదారులు కానరాక వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విశాఖపట్నం జిల్లా లంబసింగిలో 9, చింతపల్లిలో 12.2, పాడేరులో 12, అరకులో 14 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం నగరంలో కనీస ఉష్ణోగ్రత సాధారణం కంటే 3, కళింగపట్నంలో 2 సెల్సియస్‌ డిగ్రీలు తక్కువగా నమోదవుతోంది.

ఈ ఏడాది చలికాలం భిన్నంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ ఎక్కువ నమోదవుతాని, రాత్రి ఉష్ణోగ్రతలు 1 నుంచి 3 డిగ్రీలు తగ్గుతాయని తెలిపింది. దీంతో పగలు కొంచెం వేడిగా ఉన్నా రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావారణ శాఖ తెలిపింది. నవంబర్‌లో నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాతావరణ శాఖ ఈ అంచనాల్ని విడుదల చేసింది. దీని ప్రకారం డిసెంబర్‌ నెలాఖరు వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 సెల్సియస్‌ డిగ్రీల వరకు తక్కువగా నమోదు అవుతాయి.