ముగ్గురు మోడీలు ఒక్కటయ్యారు:లోకేష్ ట్వీట్లు

హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వైసీపీ అధినేత జగన్ ను కలవటం పై ఒక్కోరో ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈరోజు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. వీరి కలయికపై ఏపీ మంత్రులు తలో రీతిగా స్పందించగా సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ, తెలంగాణ మోడీ ఒక్కటయ్యారని , ఇంతకాలం వీరిమధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతమైందని విమర్శించారు. నాలుగున్నరేళ్లపాటు విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటా దక్కకుండా అడ్డుపడిన కేసీఆర్‌తో కలిసి జగన్ ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్ ఏర్పాటు చేశారని లోకేష్ ట్విట్టర్ లో విమర్శించారు. లంకలో పుట్టిన వాళ్లు అంతా రాక్షసులు, ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా వారి వారసులు అని ఆంధ్రులను అవమానించిన కేసీఆర్ గారు, ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుందని అవహేళన చేసిన కేసీఆర్ గారితో జగన్ మోడీ రెడ్డి జత కట్టారని దుయ్యబట్టారు.