TTD: 19 ఏళ్లనాటి తిరుమల శ్రీవారి డాలర్ల కేసులో అధికారులు, ఉద్యోగులకు ఊరట..
19ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి డాలర్ల కేసులో అధికారులు, ఉద్యోగులకు ఊరట లభించింది.

TTD
TTD: 19ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి డాలర్ల కేసులో అధికారులు, ఉద్యోగులకు ఊరట లభించింది. ఈ కేసులో ఆరోపణల నుంచి 15 మంది టీటీడీ అధికారులు, ఉద్యోగులు విముక్తి పొందారు.
2006లో తిరుమలలో శ్రీవారి డాలర్ల విక్రయ కౌంటర్‌లో అక్రమాలు జరిగాయని 20 మందిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కౌంటర్‌లో 5 గ్రాముల బరువుండే 300 శ్రీవారి డాలర్లు అదృశ్యమయ్యాయని టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం
గుర్తించింది. వాటి విలువ రూ.15.40లక్షలుగా అంచనా వేసింది. విచారణ జరిపి 20 మంది బాధ్యులంటూ టీటీడీకి విజిలెన్స్ నివేదిక అందజేసింది.
ప్రభుత్వం అప్పట్లో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించింది.వాళ్లూ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారు. విజిలెన్స్, సీబీసీఐడీ నివేదికల ఆధారంగా ప్రభుత్వం సంబంధిత ఉద్యోగులు, అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఆ బాధ్యతను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు అప్పగించింది. గతేడాది జనవరిలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
విచారణలో 15మంది ఉద్యోగులు, అధికారులపై ఆరోపణలు రుజువు కాలేదని నివేదిక పేర్కొంది. దీంతో సదరు ఉద్యోగులు, అధికారులపై చర్యలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని టీటీడీ ఈవో కోరారు. తాజాగా.. బుధవారం 15మంది ఉద్యోగులు, అధికారులపై చర్యలు నిలిపివేస్తూ రెవెన్యూశాఖ ఎఫ్ఏసీ ముఖ్య కార్యదర్శి వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. అయితే, వీరిలో పలువురు ఇప్పటికే కొందరు రిటైర్డ్ కాగా.. మరికొందరు మృతి చెందారు.