తొలి దశ నామినేషన్ల దాఖలుకు నేడు చివరిరోజు

తొలి దశ నామినేషన్ల దాఖలుకు నేడు చివరిరోజు

Updated On : January 31, 2021 / 7:55 AM IST

first phase nominations for ap panchayat elections : ఏపీలో తొలి విడత పంచాయితీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్‌ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో ఇవాళ నామినేషన్లు భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌ స్థానాలకు దాదాపు 7 వేల 460 నామినేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. వార్డు స్థానాలకు 23 వేల 318 నామినేషన్లు వేశారు. మొదటి రోజుతో పోలిస్తే రెండోరోజు భారీగా పెరిగాయి. శుక్ర, శనివారం రెండు రోజులు కలిపి ఇప్పటి వరకు సర్పంచ్‌ స్థానాలకు 8 వేల 773 నామినేషన్లు దాఖలవ్వగా… వార్డు సభ్యుల స్థానాలకు 25వేల 519 మంది నామినేషన్లు వేశారు.

ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్లలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో సర్పంచ్‌ స్థానాలకు 11 వందల 56 వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో వార్డు సభ్యుల స్థానాలకు అత్యధికంగా 4 వేల 678 నామినేషన్లు వేశారు. తొలివిడత పోరులో నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4 తుది గడువుగా నిర్ణయించారు.

అదేరోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 9న జరుగనుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫలితాలు వెలువడతాయి. ఇక రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 2న నోటిఫికేషన్‌ వెలువడనుంది.