Kakinada: కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి.. కాకినాడలో దారుణ ఘటన
కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే వారి పాలిట కాలయముడిగా మారాడు.

Kakinada Tragic incident
Kakinada: కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే వారి పాలిట కాలయముడిగా మారాడు. ఆరు, ఏడేళ్ల వయస్సు కలిగిన ఇద్దరు కొడుకులను చంపేసి.. ఆ తరువాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుపుతూ సూసైడ్ నోడ్ రాశాడు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కు భార్య తనూజ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో జోషిల్ (7) ఒకటో తరగతి చదువుతున్నాడు. నిఖిల్ (6) యూకేజీ చదువుతున్నాడు. చంద్రశేఖర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ ఎకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. నగరంలో ఓ ప్లాట్ తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయితే, పిల్లలు సరిగా చదవడం లేదంటూ ఇటీవలే పాఠశాలను మార్పించాడు.
హోలీ పండుగరోజు (శక్రవారం) చంద్రకిశోర్ భార్య, పిల్లలను తీసుకొని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్లాడు. అయితే, పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పి భార్య తనూజను కార్యాలయం వద్దనే ఉండాలని సూచించాడు. పది నిమిషాల్లో తిరిగి వస్తామని చెప్పాడు. అయితే, ఎంతసేపటికీ భర్త రాకపోవటంతోపాటు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి చేరుకుంది. కిటికీలో నుంచి ఇంట్లోకి చూడగా ఒక్కసారిగా ఆమె గుండె ఆగినంతపనైంది. భర్త ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. తనూజ బోరున విలపిస్తూనే తలుపులు బలవంతంగా తెరిచి చూసింది. పిల్లలిద్దరూ కాళ్లూ చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు మునిగిపోయి విగత జీవులుగా పడి ఉన్నారు. కొడుకులను అలాచూసి తనూజ అక్కడే కుప్పకూలిపోయింది.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని పరిశీలించారు. అయితే, చంద్రకిశోర్ రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. అందులో.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని రాశాడు. చంద్రకిశోర్ సోదరుడు మాట్లాడుతూ.. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవని, ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.