TTD Calendar : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ డైరీలు, క్యాలెండర్లు ఇలా పొందండి.. నేరుగా మీ ఇంటికొస్తాయి..
TTD Calendar : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ప్రతీయేటా కొత్త సంవత్సరంకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ..
TTD Calendar
TTD Calendar : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ప్రతీయేటా కొత్త సంవత్సరంకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో క్యాలెండర్లు, డైరీలను ప్రచురిస్తుంది. టీటీడీ క్యాలెండర్లు, డైరీలు దక్కించుకునేందుకు దేశవిదేశాల్లోని శ్రీవారి భక్తులు ఆసక్తి చూపుతుంటారు. ఈ ఏడాది కూడా టీటీడీ 2026కు సంబంధించి డైరీ, క్యాలెండర్లు రూపొందించింది. వాటిని దక్కించుకునేందుకు శ్రీవారి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రతీ ఏడాదిలాగానే 2026 సంవత్సరంకు సంబంధించి క్యాలెండర్, డైరీలను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటికి ధరలను నిర్ణయించింది. భక్తుల సౌకర్యార్థం 12 పేజీల క్యాలెండర్ రూ. 130, డీలక్స్ డైరీ రూ.150, చిన్న డైరీ రూ.120, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75, ఆరు పేజీల 3డీ డిజిటల్ క్యాలెండర్ రూ.450, శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.30, టీటీడీ స్థానికాలయాల క్యాలెండర్ రూ.130లకు అందుబాటులో ఉంచింది.
టీటీడీ క్యాలెండర్లు, డైరీలు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట, శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయ సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని తితిదే పబ్లికేషన్ స్టాళ్లలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, దిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణ మండపాల్లో విక్రయిస్తున్నారు. ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ అందుబాటులో ఉంచారు.
ఆన్‌లైన్‌లోనూ టీటీడీ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సరంకు సంబంధించి క్యాలెండర్, డైరీలను పొందొచ్చు. వీటిని టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. 12 పేజీల క్యాలెండర్, డీలక్స్ డైరీ, చిన్న డైరీ, టేబుల్ టాప్ క్యాలెండర్, ఆరు పేజీల 3డీ డిజిటల్ క్యాలెండర్లను www.tirumala.org, ttdevasthanams.ap.gov.in లో బుక్ చేసుకున్న భక్తులకు టీటీడీ పోస్టు ద్వారా వారు పొందుపర్చిన అడ్రస్సుకు పంపిస్తుంది.
ఇలా కూడా పొందొచ్చు..
♦ భక్తులు డీడీ తీసి పంపినా టీటీడీ క్యాలెండర్, డైరీలు పొందొచ్చు.
♦ ఇందుకోసం ‘కార్యనిర్వహణాధికారి టీటీడీ, టీటీడీ’ పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్ లెటర్‌తో కలిపి ‘డిప్యూటీ ఈవో, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కేటీ రోడ్, తిరుపతి’ చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
♦ రవాణా చార్జీలను అదనంగా తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంటుంది.
♦ క్యాలెండర్, డైరీలకు సంబంధించిన ఇతర సమాచారం కోసం 0877-2264209ను సంప్రదించాలని టీటీడీ సూచించింది.
