తిరుమలలో నూతన ఈవో ముమ్మర తనిఖీలు.. ఆ విభాగాలపై ప్రత్యేక దృష్టి

వైసీపీ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులు, వాటి నాణ్యతపై కూడా ఈవో శ్యామలరావు రివ్యూ చేసే అవకాశం ఉంది. 15శాతం వరకు కమీషన్లకు ఇంజనీరింగ్ పనులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

తిరుమలలో నూతన ఈవో ముమ్మర తనిఖీలు.. ఆ విభాగాలపై ప్రత్యేక దృష్టి

TTD EO Shyamala Rao

Updated On : June 18, 2024 / 9:28 AM IST

TTD EO Shyamala Rao : తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అన్నివిభాగాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోమవారం శ్రీవారి మెట్టు నడకదారి, కాటేజీలు అన్న ప్రసాదంలో శ్యామల రావు తనిఖీలు చేశారు. టీటీడీ సౌకర్యాలపై భక్తులను ఆరా తీశారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని భక్తులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. తనిఖీల అనంతరం విభాగ అధికారులతో ఈవో శ్యామలరావు సమీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాల ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.

Also Read : భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా సేవ చేస్తా- టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు

అన్న ప్రసాద భవనంలో అన్నం నాణ్యత, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను ఈవో పరిశీలించారు. టీటీడీ ఈవో శ్యామలరావు వరుస తనిఖీలతో టీటీడీ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. మొన్న అన్న ప్రసాద భవనంలో నాణ్యతను పరిశీలించిన ఈవో.. నిన్న క్యూలైన్లు పరిశీలించి అన్న ప్రసాద భవనంలో ప్రసాదం స్వీకరించారు. ఎన్నికల కూటమి విజయంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు నాయుడు తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషిలో మార్పు వచ్చిందా?

వైసీపీ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులు, వాటి నాణ్యతపై కూడా ఈవో శ్యామలరావు రివ్యూ చేసే అవకాశం ఉంది. 15శాతం వరకు కమీషన్లకు ఇంజనీరింగ్ పనులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన విరాళాలు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎలా ఖర్చు పెట్టారు? అనే విషయాలపైన కూడా ఈవో ఆరా తీస్తున్నట్లు సమాచారం.