TTD Kalyanamastu : ఏపీలో పెళ్లి కాని వారికి శుభవార్త- టీటీడీ కళ్యాణమస్తు తిరిగి ప్రారంభం

తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో  ఆగస్టు 7వ తేదీన ఏపీలోని 26 జిల్లాల్లో కళ్యాణమస్తు పేరుతో పెద్ద ఎత్తున సామూహిక ఉచిత వివాహాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

TTD Kalyanamastu :  ఏపీలో పెళ్లి కాని వారికి శుభవార్త- టీటీడీ కళ్యాణమస్తు తిరిగి ప్రారంభం

TTD Kalyanamastu

Updated On : June 3, 2022 / 5:31 PM IST

TTD Kalyanamastu :  తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో  ఆగస్టు 7వ తేదీన ఏపీలోని 26 జిల్లాల్లో కళ్యాణమస్తు పేరుతో పెద్ద ఎత్తున సామూహిక ఉచిత వివాహాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.  ఈ రోజుఆయన తిరుమలలో మాట్లాడుతూ  పేదవారికి అండగా ఉండేందుకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు పేరు మీదుగా ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించారని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో తిరిగి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని  ఆయన  వివరించారు.

వైఎస్సార్ మరణం తరువాత ఈ కార్యక్రమం అర్ధంతరంగా నిలిపి వేశారని, వైసీపి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని తమ పాలకమండలి నిర్ణయం తీసుకుందని  సుబ్బారెడ్డి  చెప్పారు. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నామని ఆయన చెప్పారు.

సుముహూర్తం
2022 వ సంవత్సరం ఆగస్టు  7వ తేదీ  స్వస్తిశ్రీ   చాంద్రమానేన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఆదివారం ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రయుక్త    సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారని సుబ్బారెడ్డి చెప్పారు.  అర్హులైన వారందరూ ఆయా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో  వారి వారి రాష్ట్రాల్లో  సామూహిక ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ సిద్దంగా ఉందని ఛైర్మన్ వెల్లడించారు.

గతంలో 45 వేల జంటలకు కళ్యాణమస్తు..
2007 పిబ్రవరి 22న కళ్యాణమస్తు కార్యక్రమాన్ని అప్పటి సీఎం వైఎస్సార్ ప్రారంభించారు. మొత్తం 6వ విడతలలో కళ్యాణమస్తూ కార్యక్రమం ద్వారా 45 వేల పేద జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. టీటీడీ చివరగా 2011 మే 20న కళ్యాణమస్తూ చివరి విడత కళ్యాణమస్తు నిర్వహించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించి పేదలకు ఆర్థిక భారం తగ్గించనుంది. ఈ నిర్ణయంపై పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణమస్తులో పెళ్లి చేసుకోవాలనుకునే వధూవరులు, వారి జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

Also Read : BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. వేగంగా ఏర్పాట్లు