మహాశాంతి యాగం..! తిరుమల లడ్డూ వివాదంతో టీటీడీ కీలక నిర్ణయం.. ఎన్ని రోజులు చేస్తారంటే..
శ్రీవారి ఆలయంలోనే యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Ttd Laddu Row : తిరుమల ఆగమ పండితులతో ఉన్నత స్థాయి సమీక్ష చేసింది టీటీడీ. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజులు తిరుమలలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలోనే శాంతి యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఎప్పటి నుంచి ఈ యాగం నిర్వహించాలి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో అధ్యక్షతన టీటీడీ పరిపాలన భవనంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఆగమ పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు, ఇతర ఆగమ సలహా మండలి సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ఒక దోషంగా టీటీడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దోష నివారణకు, ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు ఎంచుకోదగ్గ నివారణ చర్యలపై డిస్కషన్ చేసింది. ఇలాంటి దోషాలు తలెత్తిన సందర్భంలో వాటి తీవ్రతను తగ్గించేందుకు, వాటి ప్రభావం లేకుండా చేసేందుకు ఆగమ శాస్త్రంలో ఎలాంటి ప్రత్నామ్నాయ మార్గాలు ఉన్నా? ఏ విధంగా దోష నివారణ చేపట్టాలి అన్న అంశంపై టీటీడీ ఈవో ఆగమ సలహా మండలి సభ్యులతో చర్చించారు.
దోష నివారణకు శాంతి యాగం చేయాలని ఆగమ సలహా మండలి సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది. శ్రీవారి ఆలయంలోనే మహా శాంతి యాగం నిర్వహించడం ద్వారా దోష నివారణ చేయొచ్చని సూచించినట్లు సమాచారం. శాంతి యాగంలో భాగంగా ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి నిర్వహించబోతున్నారు. ఈ మహా శాంతి యాగం మూడు రోజుల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఆలయం లోపలే యాగం నిర్వహించనున్నారు. అయితే, ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు యాగం చేయాలని తొలుత భావించారు.
కానీ, రకరకాల అంశాల పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. శాంతి యాగం ఆలయంలోనే నిర్వహిస్తే ఆర్జిత సేవలన్నీ (సుప్రభాతం, తోమాల, కల్యాణోత్సవం, అర్చన) రద్దు చేయాల్సి వస్తుంది. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించరు. అయితే, ఇప్పటికే ఆర్జిత సేవా టికెట్లను ఎన్నో ఏళ్ల ముందు పెద్ద సంఖ్యలో భక్తులు కొనుగోలు చేసి ఉంటారు. వారంతా సేవ కోసం వేచి చూస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ఆర్జిత సేవలు రద్దు చేసే వాటిని బుక్ చేసుకున్న భక్తులు ఇబ్బందులు పడతారనే విషయాన్ని ఆలోచిస్తున్నారు. ఈ మూడు రోజులు సేవల టికెట్లు కలిగిన భక్తులకు మరో ప్రత్యామ్నాయం రోజున దర్శనాలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై టీటీడీ అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.
Also Read : వలస నేతలంతా చలో జనసేన అనటానికి కారణమేంటి? చేరికలపై పవన్ కల్యాణ్ వైఖరేంటి?
మొత్తంగా దోష నివారణకు సంప్రోక్షణలో భాగంగా మహాశాంతి యాగం నిర్వహించాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఎప్పటి నుంచి యాగం జరుగుతుంది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ యాగంపై టీటీడీ ఈవో అధికారికంగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక శ్రీవారి ఆలయంలోనే మహా సంప్రోక్షణలో భాగంగానే మహాశాంతి యాగం నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. దోష నివారణకు, దోష ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ మహాశాంతి యాగం ఉపయోగపడుతుందని ఆగమ సలహాదారులు సలహా ఇచ్చిన నేపథ్యంలో టీటీడీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.