కేంద్రం పదే పదే ప్యాకేజీలు ఇవ్వడం కుదరదు- విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు.

కేంద్రం పదే పదే ప్యాకేజీలు ఇవ్వడం కుదరదు- విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

Updated On : September 28, 2024 / 6:21 PM IST

Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణపై ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ప్లాంట్ నష్టాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్యాకేజీలు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. వైజాగ్ ఉక్కు పరిశ్రమ నష్టాలను ప్రభుత్వం భరించలేదని కూడా అన్నారు. స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తెచ్చేందుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నట్లు మంత్రి వర్మ వెల్లడించారు.

Also Read : జగన్‌కు ప్రాణగండం ఉంది..!- పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

”ప్రత్యామ్నాయ అవకాశాలను మీడియా ముఖంగా వెల్లడించలేను. విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్, కార్మికుల ఆందోళనను గౌరవిస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనానికి సాంకేతిక సమస్యలున్నాయి. స్టీల్ ప్లాంట్ కి ఆర్ధిక సహకారం కోసం NMDC తో చర్చలు జరుపుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తక్కువ. కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. ఉత్పత్తి లేదు కాబట్టి కార్మికులను కొనసాగించడం వల్ల నష్టాలు పెరుగుతున్నాయి. కొందరు ఉద్యోగులను తొలగించి మరో ప్లాంట్ లో డిప్యుటేషన్ పై పంపాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నాం” అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు.

”నష్టాలను భరించే శక్తి కేంద్రానికి పదే పదే ఉండదు. ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు, ఎంత ఉత్పత్తి ఉంది. వాస్తవాలు నా దగ్గర ఉన్నాయి. కానీ, కార్మికులందరి ప్రయోజనాలు కాపాడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావాలి. ఇదే మా ఆలోచన. లాభాలను ఎప్పుడు పోల్చగలం. ఏడాదికి 4వేల కోట్లు పోతున్నాయి. లాభాల్లోకి తీసుకు రావాలనే ప్రయత్నం జరుగుతోంది. చాలా బకాయిలు ఉన్నాయి. చేయూతనిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. గతంలో ప్యాకేజీ ఇచ్చాం. మళ్లీ ప్యాకేజీ అడుగుతున్నారు. మూడేళ్ల తర్వాత మళ్లీ ప్యాకేజీ అడుగుతారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ప్యాకేజీ అవసరం ఉంది” అని కేంద్రమంత్రి వర్మ అన్నారు.

 

 

అటు విశాఖ స్లీట్ ప్లాంట్ దగ్గర కార్మిక సంఘాలు ధర్నాకు దిగాయి. స్లీట్ ప్లాంట్ లో పని చేస్తున్న 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

”1310 రోజులుగా ఉద్యమం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజల మద్దతుతో ఉద్యమం నడుపుతున్నాం. పూర్తి స్థాయిలో మొత్తం మూడు ప్లాట్ ఫామ్ లను నడపాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి పెత్తనం చేస్తోంది. ఇప్పటికే ప్లాంట్ అట్టుడుకుతోంది.

ఎవరికీ ఏమీ చెప్పకుండానే నిన్న అర్ధాంతరంగా 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ బయటకు పోవాలని అంటున్నారు. అనేక మంది త్యాగాలు చిందించిన తర్వాత వచ్చిన పరిశ్రమ ఇది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ 8లక్షల కోట్ల రూపాయల ఆస్తులను కారు చౌకగా అమ్మి, 18వేల మంది కార్మికులను ఉద్యోగాలను తొలగిస్తూ అనేకమైన దుర్మార్గాలకు పాల్పడుతోంది. కార్మికులను ఆకలితో చంపాలని చూస్తున్నారు” అని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కార్మిక సంఘాల నాయకులు.