KA Paul : తగ్గేదేలే అంటున్న కేఏ పాల్.. ప్రధాని మోదీ మాట్లాడే వరకు దీక్ష విరమించేది లేదని ప్రకటన
ఏపీలో రాక్షస పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. మత్తు మందు ఇచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించారు. KA Paul - Steel Plant

KA Paul Fast (Photo : Google)
KA Paul – Steel Plant : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పాల్.. పోలీసులు, ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పోలీసులు తన చేతులు, కాళ్ళు విరగ్గొట్టారు అని పాల్ ఆరోపించారు. నా దీక్ష 24 గంటలు గడవక ముందే భగ్నం చేశారని వాపోయారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే సీఐ రామారావును సస్పెండ్ చేయాలని పాల్ డిమాండ్ చేశారు.
”నా చావు కోసం ఈ రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. విశాఖ స్టీల్ ఫ్లాంట్ నష్టాల్లో లేదు. నష్టాలు వచ్చేటట్లు చేస్తున్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖకు ఏం చేశారు? ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీల నేతలకు చిత్తశుధ్ధి ఉంటే స్టీల్ ఫ్లాంట్ కోసం రాజీనామాలు చేయండి నాతో ప్రధాని మోదీ మాట్లాడే వరకు నేను దీక్ష విరమించను. కేజీహెచ్ లో మత్తు మందు ఇచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించారు. భోజనం చేయకుండా నా దీక్షను కొనసాగిస్తాను. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ను అమ్మనివ్వను” అని కేఏ పాల్ అన్నారు.
Also Read..Gannavarm : గన్నవరం రాజకీయాల్లో కీలక పరిణామాలు.. ప్లాన్ మార్చిన వైసీపీ!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేఏ పాల్ విశాఖలో నిరవధిక దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో సత్వర న్యాయం జరగాలంటే ఏపీకి చెందిన అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని పాల్ సూచించారు. ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసినప్పుడే కేంద్రం వెంటనే చర్యలు తీసుకుంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తామని కేంద్రం అధికారికంగా ప్రకటించే వరకు దీక్ష కొనసాగిస్తానని తేల్చి చెప్పారు కేఏ పాల్.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఆశీలుమెట్టలోని ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో సోమవారం(ఆగస్టు 28) సాయంత్రం ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 32 మంది ప్రాణత్యాగంతో విశాఖ ఉక్కు సాకారమైందన్నారు కేఏ పాల్. 16వేల మంది రైతులు తమ భూములను ప్లాంటు నిర్మాణానికి ఇచ్చారని, వారందరి త్యాగాలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం మొండిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ముందుకెళ్లడం సరికాదన్నారు. లక్ష కోట్ల విలువైన భూములు కలిగిన ప్లాంటును తక్కువ ధరకే అదానీకి విక్రయించే యత్నాలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు కేఏ పాల్.