సీఎం జగన్ నియోజకవర్గం మారమన్నారు.. కళ్యాణదుర్గం వదిలేస్తున్నా..

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీలో సీట్ల కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి ఉషాశ్రీ చరణ్ సంచలన ప్రకటన చేశారు.

సీఎం జగన్ నియోజకవర్గం మారమన్నారు.. కళ్యాణదుర్గం వదిలేస్తున్నా..

Ushasri Charan sensational statement ready to contest Penukonda

Updated On : December 28, 2023 / 12:36 PM IST

Ushasri Charan: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉషాశ్రీ చరణ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నుంచి పోటీ చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తాను కళ్యాణదుర్గం స్థానాన్ని వదిలేసి పెనుకొండ వెళ్తున్నానని చెప్పారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం స్థానాన్ని బోయలకు కేటాయించాలని అధిష్టానం నిర్ణయించిందని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, ఆయన ఆదేశాలు పాటిస్తానని అన్నారు.

”వచ్చే ఎన్నికల్లో నేను పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నా. అధిష్టానం నుంచి నాకు ఆ దిశగా ఆదేశాలు వచ్చాయి. సీఎం జగన్ ఆదేశించారు.. నేను పెనుకొండ వెళ్తున్నా. కళ్యాణదుర్గం స్థానాన్ని బోయలకు కేటాయించాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయం స్వాగతిస్తున్నా.. ఆదేశాలు పాటిస్తాను. ఇన్ని రోజులు కళ్యాణదుర్గం ప్రజలు ఎంతో ఆదరించారు. వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను… ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా. సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగానే మార్పు ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్లినా.. ఒక్కటే నినాదం.. అది జగన్ నినాదం. ప్రజలు ఎక్కడైనా సరే జగన్ ని, ఫ్యాన్ గుర్తునే చూస్తున్నార”ని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు.

175 స్థానాల్లో గెలవడమే లక్ష్యం
కాగా, మంత్రి ఉషాశ్రీ చరణ్ నిన్న తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగానే సీటు మార్పు గురించి ఆమెకు సీఎం జగన్ వివరించినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ తో భేటీ తర్వాత ఉషాశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. వై నాట్ 175 కోసమే సీట్లలో మార్పులు చేర్పులు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. తన స్థానంలో ఎటువంటి మార్పులు చేసినా తనకు అభ్యంకరం లేదన్నారు. సీఎం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడమే తమ లక్ష్యమని అన్నారు. ఎంపీగా పోటీ చేయాలని సీఎం ఆదేశించినా సిద్ధమని ప్రకటించారు.

Also Read: వైసీపీ ఎమ్మెల్యేలలో మళ్లీ టెన్షన్.. సెకండ్ లిస్ట్ రెడీ చేసిన సీఎం జగన్..!