ప్రజలపై ధరల దండయాత్ర.. పసిడి నుంచి పచ్చిమిర్చి వరకు మండిపోతున్న రేట్లు

ఆకలి తీర్చే కూరగాయల ధరలు దాడి చేస్తున్నాయి. పెట్రోల్ ధరలు వాత పెడుతున్నాయి. సామాన్యులు గడపదాటితే దబిడిదిబిడే అన్నట్లుగా ధరలు మండిపోతున్నాయి.

ప్రజలపై ధరల దండయాత్ర.. పసిడి నుంచి పచ్చిమిర్చి వరకు మండిపోతున్న రేట్లు

Prices Tension : సామాన్యులపై ధరలు దండయాత్ర చేస్తున్నాయి. అదీ, ఇదీ అన్న తేడా లేదు. అన్నింటి ధరలు దడ పుట్టిస్తున్నాయి. బంగారం లాగే కూరగాయల ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ రేట్లు వాత పెడుతుంటే.. పప్పు, ఉప్పులు.. వంటింట్లో నిప్పు లేకుండానే మంట పెడుతున్నాయి. ఏ మార్కెట్ కు వెళ్లినా, ఏ షాప్ కి వెళ్లినా.. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. సంచిలో డబ్బు తీసుకుని చేతిలో సరుకులు తీసుకొచ్చే రోజులు వస్తున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. కూరగాయలు, నాన్ వెజ్, నిత్యవసర సరుకుల ధరలు మోత మోగిస్తున్నాయి.

చికెన్ ధరలు చుక్కలను తాకాయి. కిలో చికెన్ ధర ట్రిపుల్ సెంచరీ దాటేసి నాటౌట్ అన్నట్లు చూస్తోంది. కేజీ కొందామని వచ్చిన వారు ఆ బోర్డు చూసి అరకేజీతో సర్దుకుపోతున్నారు. అటు మటన్ రేట్లు కూడా మండిపోతున్నాయి. కిలో రూ.850 వరకు రేటు ఉంది. కొందరు చికెన్ కంటే కూరగాయలే మేలు అంటూ వెజ్ మార్కెట్లకు వెళ్తున్నారు. అయితే, అక్కడా ధరల పోటు తప్పడం లేదు. కూరగాయల ధరలు కొనకుండానే గాయాలు చేస్తున్నాయి. కూరగాయల వ్యాపారులు ఒక్కో కూరగాయ రేటు చెబుతుంటే గుండె పేలినంత పనైపోతోంది. పచ్చిమిర్చి సెంచరీ కొట్టేసింది. కొత్తిమీర డబుల్ సెంచరీ కొట్టి.. నన్నూ ఎవరూ కొనలేరు అంటూ కవ్విస్తోంది. ఇటు టమాట ధర ఠారెత్తిస్తోంది. కిలో 80 రూపాయలకు చేరింది.

అలంకరణకు ఉపయోగపడే బంగారం రేటు పెరిగిపోయింది. ఇటు ఆకలి తీర్చే కూరగాయల ధరలు కూడా దాడి చేస్తున్నాయి. పెట్రోల్ ధరలు సామాన్యులకు వాత పెడుతున్నాయి. దీనికి తోడుగా కేంద్రం టోల్ రేట్లను పెంచేసింది. మొత్తానికి సామాన్యులు గడపదాటితే దబిడిదిబిడే అన్నట్లుగా ధరలు మండిపోతున్నాయి.

Also Read : భోజనం తర్వాత నడవడం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలివే!