Venigandla Ramu: కొడాలి నాని గుండెల్లో రైళ్లు.. కొడాలి నానికి వెనిగండ్ల రాము కౌంటర్

సాఫ్టుగా ఉన్నంత మాత్రాన మేము చేతకాని వాళ్లం కాదు.. గుర్తుంచుకో నాని. కార్లల్లో తిరిగేవాళ్లే రోడ్డు వాడతారనే కొత్త థియరీని కొడాలి నాని చెబుతున్నాడు.

Venigandla Ramu: కొడాలి నాని గుండెల్లో రైళ్లు.. కొడాలి నానికి వెనిగండ్ల రాము కౌంటర్

venigandla ramu satire on kodali nani in gudivada tdp meeting

Updated On : January 18, 2024 / 8:03 PM IST

Venigandla Ramu on Kodali Nani: గుడివాడ సభకు వచ్చిన జనాన్ని చూసి కొడాలి నాని గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని టీడీపీ ఇన్‌చార్జి వెనిగండ్ల రాము అన్నారు. టీడీపీ గుడివాడ సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సభకు ఐదు వేలు జనం వస్తే గొప్పేనని కొడాలి నాని అన్నారని.. ఇక్కడి వచ్చి చూస్తే ఎంత మంది జనం వచ్చారో తెలుస్తుందన్నారు. ”రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు కొడాలి నాని కన్పించ లేదు. కార్లల్లో తిరిగేవాళ్లే రోడ్డు వాడతారనే కొత్త థియరీని కొడాలి నాని చెబుతున్నాడు. చంద్రబాబు కట్టించిన టిడ్కో ఇళ్లకు రంగేస్తే.. వైసీపీ కట్టించినట్టు అవుతుందా? చంద్రబాబు విజన్ వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందోననడానికి నేనే నిదర్శనం. సాఫ్టుగా ఉన్నంత మాత్రాన మేము చేతకాని వాళ్లం కాదు.. గుర్తుంచుకో నాని. కొడాలి నాని ఇప్పటికే సర్దుకేసుకున్నాడ”ని వెనిగండ్ల రాము అన్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం: కొనకళ్ల
వైసీపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడమే టీడీపీ జనసేన లక్ష్యమని కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందని వాపోయారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని, న్యాయస్థానాల్లో తమకు న్యాయం దక్కిందని చెప్పారు. రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకోవడమే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

టీడీపీకి కొడాలి నాని వెన్నుపోటు: రావి
టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో అందరికీ జగన్ చుక్కలు చూపించారని, అన్ని వర్గాలను ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. కొడాలి నాని 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారని.. టీడీపీ బీఫాం ఇస్తేనే ఆయన ఎమ్మెల్యే అయ్యారని గుర్తు చేశారు. పదేళ్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని.. తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీలో చేరారని తెలిపారు. మంత్రి అయిన తర్వాత గుడివాడను కొల్లగొట్టి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు తీరతాయన్నారు.

Also Read: ఎవరినీ వదలిపెట్టం, ప్రతిదానికి వడ్డీతో సహా చెల్లిస్తాం- గుడివాడలో చంద్రబాబు మాస్ వార్నింగ్

కొడాలి నానికి బూతుల కాంట్రాక్ట్: బండ్రెడ్డి
వైసీపీ పాలనలో సామాన్యుల నడ్డి విరిచేలా ధరలు పెంచేశారని, వైసీపీ అంటే అందరూ భయపడుతున్నారని జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేసిన కొడాలి నాని.. ఒక్కసారైనా ధరల నియంత్రణ గురించి మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. సీఎంగా ఉన్న జగన్.. కొడాలి నానికి బూతుల కాంట్రాక్ట్ ఇచ్చారని, బూతులు తిడితేనే పదవులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. గుడివాడలో వెనిగండ్ల రామును గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.