Chandrababu Naidu : ఎవరినీ వదిలిపెట్టం, ప్రతిదానికి వడ్డీతో సహా చెల్లిస్తాం- గుడివాడలో చంద్రబాబు మాస్ వార్నింగ్
రూ. 10 ఇచ్చి.. రూ. 100 దోచుకుంటున్నారు. పన్నులు, ధరల పెంపు వల్ల ప్రతి పేద కుటుంబంపై నాలుగైదు లక్షల భారం వేశారు.

Chandrababu Naidu
Chandrababu Naidu : గుడివాడ బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎవరినీ వదిలిపెట్టం, వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్లే పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. గుడివాడ తులసీవనంలో గంజాయి మొక్కలు పుడుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. కొందరు నాయకులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ ఎవరికీ భయపడదు అని చెప్పారు. బూతు శ్రీకి ఎమ్మెల్యే, బూతు రత్నకు ఎంపీ, బూతు సామ్రాట్ కు మంత్రి పదవి.. ఇదీ జగన్ చేసే రాజకీయం అంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు. ప్రతిపక్ష నేతలను తిడితేనే టిక్కెట్ ఇస్తారట అని విమర్శించారు. ఐదేళ్లల్లో సీఎం రెండుసార్లు మాత్రమే కలిశారు.
”ఎన్టీఆర్ అంటేనే ప్రభంజనం. సమాజాన్ని జాగృతం చేసే నాయకులు కృష్ణా జిల్లాలో పుట్టారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్ధానం ఇక్కడి నుంచే ప్రారంభించారు” అని వ్యాఖ్యానించారు.
Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..!
” జగన్ పాలనలో ప్రతి ఒక్కటీ అరాచకమే. నాసిరకం బ్రాండ్లు. ఎగిరెగిరి పడ్డారు. దొంగ ఓట్లు నమోదు చేశారు. ఓ కలెక్టర్ ను సస్పెండ్ చేశారు. అందరూ నష్టపోయారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్. రూ. 10 ఇచ్చి.. రూ. 100 దోచుకుంటున్నారు. పన్నులు, ధరల పెంపు వల్ల ప్రతి పేద కుటుంబంపై నాలుగైదు లక్షల భారం వేశారు. వైసీపీ ప్రభుత్వం.. పేదల రక్తం తాగే ప్రభుత్వం. పోలవరం ఆగింది.. రాజధాని ఆగింది.
అసలు పెత్తందారు సీఎం జగన్. పెత్తందారు జగన్.. పేదల గురించి మాట్లాడుతున్నారు. భూరక్ష చట్టం పేరుతో భూ భక్షణ చేస్తారు. ఓట్ల దొంగలు పడ్డారు.. రేపు భూముల దొంగలు పడతారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం. ఈ ప్రభుత్వం చేసేదంతా పనికిమాలిన పనులు. జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. సినిమాల్లో విలన్ నాగభూషణం తరహాలో జగన్ తడి గుడ్డలతో గొంతుకోస్తారు. బాబాయిని చంపేశారు.. చెల్లెలిపై కేసులు పెట్టారు. కోడికత్తి శీనును జైలు నుంచి బయటకు రాకుండా చేశారు.
Also Read : అధికారం దక్కాలంటే అక్కడ మెజార్టీ సీట్లు గెలవాల్సిందే.. ఇంతకీ ఆ జిల్లా ఏది?
ఆడబిడ్డలకు సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్. తన ఇంటి ఆడబిడ్డకు ఆస్తిలో హక్కు కల్పించడం లేదు. ఇదా విశ్వసనీయత..? నిన్నటి వరకు ఆమె జగనన్న బాణం.. ఇప్పుడేమైంది..? మద్యనిషేధం చేస్తానంటూనే.. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. మద్య నిషేధం చేయకుంటే ఓట్లు అడగనన్నారు.. జగన్ కు ఓట్లు అడిగే హక్కుందా..? మెగా డీఎస్సీ ఏమైంది..? జాబ్ క్యాలెండర్ ఏమైంది..? జాబ్ కావాలంటే.. టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలి” అని చంద్రబాబు అన్నారు.