బాలకృష్ణ చిన్నల్లుడికి మరో షాక్ ఇచ్చిన విజయసాయిరెడ్డి, గీతంపై చర్యలు తీసుకోవాలని ఏఐసీటీఈ చైర్మన్ కి లేఖ

  • Published By: naveen ,Published On : November 6, 2020 / 12:52 PM IST
బాలకృష్ణ చిన్నల్లుడికి మరో షాక్ ఇచ్చిన విజయసాయిరెడ్డి, గీతంపై చర్యలు తీసుకోవాలని ఏఐసీటీఈ చైర్మన్ కి లేఖ

Updated On : November 6, 2020 / 1:27 PM IST

vijayasai reddy gitam: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వరుసగా షాక్ లు ఇస్తున్నారు. శ్రీభరత్ ప్రెసిడెంట్‌గా ఉన్న గీతం డీమ్డ్ యూనివర్సిటీపై విజయసాయిరెడ్డి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. నిబంధనలు ఉల్లింఘించిన గీతంపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఢిల్లీలోని ఇండియన్ ఫార్మసీ కౌన్సిల్ (ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు లేఖ రాసిన విజయసాయిరెడ్డి తాజాగా ఏఐసీటీఈ చైర్మన్ సహస్రబుద్దేకు లేఖ రాశారు. నిబంధనలు ఉల్లంఘించిన గీతం వర్సిటీపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు విజయసాయిరెడ్డి. ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని విజయసాయిరెడ్డి లేఖలో తెలిపారు. ఏఐసీటీఈకి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఆరోపించారు. గీతం వర్సిటీ అక్రమాలపై విచారణ కమిటీ వేసి తనిఖీలు చేపట్టాలని విజయసాయిరెడ్డి కోరారు.

బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కోర్సులకు అనుమతులు రద్దు చేయాలి:
ఇటీవలే ఢిల్లీలోని ఇండియన్ ఫార్మసీ కౌన్సిల్ (ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు లేఖ రాసిన విజయసాయిరెడ్డి… గీతం యానివర్సిటీలో నిబంధనలు ఉల్లంఘించారని లేఖలో ఆరోపించారు. వెంటనే గీతం యూనివర్సిటీలో బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కోర్సులకు అనుమతులు రద్దు చేయాలని కోరారు.

గీతంను ఆంధ్రా యూనివర్సిటీ అఫిలియేషన్ తీసుకునే విధంగా ఆదేశించాలి:
గీతం వర్సిటీపై ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే కేంద్రమంత్రి రమేష్ పోక్రియాల్‌కు కూడా లేఖ రాశారు. గీతం యూనివర్శిటీ యాజమాన్యం యూజీసీ నిబంధనలు అతిక్రమించిందని.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రస్తావించారు. గీతంకు ఉన్న డీమ్డ్ యూనివర్శిటీ హోదా యూజీసీ రద్దు చేసే అవకాశం ఉందని.. విద్యార్థులు నష్టపోకుండా గీతంను ఆంధ్రా యూనివర్సిటీ అఫిలియేషన్ తీసుకునే విధంగా ఆదేశించాలని లేఖలో కోరారు.

సంస్థ గుర్తింపును రద్దు చేయాలి:
అంతేకాదు.. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) చైర్మన్‌ సురేశ్‌చంద్ర శర్మకు కూడా మరో లేఖ రాశారు విజయసాయిరెడ్డి. నిబంధనలు అతిక్రమించడంతో పాటు అవకతవకలకు పాల్పడ్డారంటూ విశాఖపట్నంలోని గీతం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, రీసెర్చి (జీఐఎంఎస్‌ఆర్‌)పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ సంస్థ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. ఎన్‌ఎంసీ, పూర్వ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు అతిక్రమిస్తూ జీఐఎంఎస్‌ఆర్‌ పని చేస్తోంది అన్నారు. జీఐఎంఎస్‌ఆర్‌కు ఎస్సెన్షియాలిటీ సర్టిఫికెట్‌ రద్దు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి సూచించాలని.. ఎన్‌ఎంసీ తనిఖీలు నిర్వహించి జీఐఎంఎస్‌ఆర్‌కు అనుమతి రద్దు చేయాలి ఎన్‌ఎంసీని కోరారు. ఇంతలోనే ఇండియన్ ఫార్మసీ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ బి.సురేష్‌కు లేఖ రాయడం గమనార్హం.