విజయవాడలోని ‘పాకిస్థాన్ కాలనీ’ పేరు మార్పు.. ఇక ఏ పేరుతో పిలుస్తారు? అసలు అప్పట్లో పాకిస్థాన్ కాలనీ అని ఎందుకు పెట్టారు?
ఇన్ని రోజులు పాకిస్థాన్ కాలనీగా ఆ ప్రాంతాన్ని ఎందుకు పిలిచారు?

Pakistan Colony
Pakistan Colony: విజయవాడలో ఓ కాలనీకి ‘పాకిస్థాన్ కాలనీ’ అని పేరు ఉండడంతో ఆ పేరును మార్చాలని కొన్నాళ్లుగా డిమాండ్లు వచ్చాయి. బార్డర్‌లో మన సైనికులను చంపుతూ, భారత్‌పై కుట్రలు చేసే పాకిస్థాన్ పేరును ఆ కాలనీకి ఎలా పెడతారని తీవ్ర విమర్శలు వచ్చాయి.
అంతేగాక, ఆ పేరు ఉండడంతో తమకు పాస్‌పోర్టులు జారీ కావడం లేదని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేసేవారు. ఎట్టకేలకు ఆ కాలనీ పేరు మారింది. “పాకిస్థాన్ కాలనీ” పేరును మార్చి ఇప్పుడు భగరథ కాలనీ అని పేరు పెట్టారు. ఈ కాలనీ విజయవాడ పాయకపురం ప్రాంతం కార్పొరేషన్ డివిజన్ 62లో ఉంటుంది.
ఇన్నాళ్లు తమ కాలనీ పేరు పాకిస్థాన్‌గా ఉండడంతో కాలనీవాసులు కొన్ని రోజులుగా ఆందోళన తెలిపారు. కొన్ని రోజుల క్రితం కలెక్టర్ లక్ష్మీశకు ఆ కాలనీవాసులు తమ కష్టాలను చెప్పుకున్నారు. దీంతో కలెక్టర్ చొరవతో ఇప్పుడు ఆ కాలనీ పేరు మారింది. మొదట కాలనీ పేరును మార్చాలంటే కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ఆ జిల్లా యంత్రాంగం నుంచి మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 418 ప్రకారం.. ఆ కాలనీ పేరును మార్చాలని సిఫార్సు చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆ కాలనీ పేరును మార్చడానికి కౌన్సిల్ అనుమతిని తీసుకున్నారు.
చివరకు కలెక్టర్ సూచనతో పాకిస్థాన్ కాలనీ పేరును భగీరథ కాలనీగా మార్చారు. భగీరథ కాలనీగా దానికి పేరు పెడుతూ దాదాపు 60 మంది కాలనీ వాసుల ఆధార్‌లో చిరునామాలను ఇప్పుడు మార్చారు. ఈ విషయాన్ని కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో చెప్పారు.
అసలు ‘పాకిస్థాన్ కాలనీ’ అని ఎందుకు పెట్టారు?
అప్పట్లో పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేస్తున్న సమయంలో పాక్‌కు చెందిన కొందరు శరణార్థులుగా ఈ ప్రాంతానికి వచ్చారు. పాక్‌కు చెందిన 40 కుటుంబాలకు అక్కడ తాత్కాలికంగా ఇళ్లు నిర్మించారు. ఈ నేపథ్యంలోనే దానిని పాకిస్థాన్ కాలనీగా వ్యవహరిస్తున్నారు.
అప్పట్లో యుద్ధం ఆగాక ఇక్కడి నుంచి శరణార్థులు అందరూ పాక్‌కు వెళ్లారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత బుడమేరుకు వరదలు రావడంతో కొందరిని పాకిస్థాన్ కాలనీకి తరలించారు. ఆయా కుటుంబాలు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు అక్కడ దాదాపు 60 ఫ్యామిలీలు ఉన్నాయి.
సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలనం.. నానమ్మ కళ్లలో ఆనందం కోసం.. చంపేసి కారులో తీసుకెళ్లి చూపించారట..